వనపర్తి, మే 14 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీలో తన స్థాయిని తగ్గించాలని చూసే వారికి సందర్భం వచ్చినప్పుడు బుద్ధి చెబుతానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హెచ్చరించారు. తమ పార్టీకి చెందిన కొందరు నేతలు కావాలనే తనపై విషం కక్కుతున్నారని, వీటినన్నింటినీ ఏఐసీసీ పరిశీలకులతోపాటు ఇంటెలిజెన్స్ వంటి సంస్థలు పసిగడుతున్నట్టు తెలిపారు. మంగళవారం ఆయన వనపర్తి జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొందరు కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారని, ఎవరెన్ని చేసినా నియోజకవర్గ కాంగ్రెస్‌కు సంబంధించిన అన్ని బాధ్యతలు తానే చూసుకుంటానని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఫారాలు తానే ఇస్తానని స్పష్టం చేశారు. పార్టీలో కర్త, కర్మ, క్రియ అన్ని తానేనని ప్రకటించుకున్నారు. అధికారం లేకుంటే ఉండలేని బ్యాచ్‌లను పార్టీలో కలుపుకొంటున్నారని, కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఉండదని, ఎప్పటికీ కుళ్లు రాజకీయాలు చేయనని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున అభివృద్ధిపై దృష్టి పెడతానని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి అధిక నిధులు రాబట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తానని తెలిపారు.