హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సంక్షేమ హాస్టళ్లలో అదే నిర్లక్ష్యం, అలసత్వమా? అని ప్రశ్నించారు. గురుకుల హాస్టళ్లలో వరుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం తీరు మారడం లేదని, విద్యార్థుల కష్టాలు తీరడం లేదని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. మంచిర్యాల గిరిజన గురుకులంలో 12 మంది విద్యార్థినులు దవాఖాన పాలై 24 గంటలు కాకముందే, మరోసారి వాంతులు, కడుపునొప్పితో విద్యార్థులు హాస్పిటల్‌కు వెళ్లడం దుష్టపాలనకు నిదర్శనమని విమర్శించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గాడితప్పిన పాలనకు వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయని మండిపడ్డారు. జిల్లా గురుకులాల్లో దాదాపు 94 మంది దవాఖానల పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు ఇంద్రవెల్లి, నిర్మల్ గురుకుల విద్యార్థులు జ్వరంతో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాంకిడి గురుకులానికి చెందిన ముగ్గురు విద్యార్థుల పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సరైన అన్నం పెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. ఇప్పటికైనా మొద్దునిద్రను వీడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.