MLA Seethakka | ములుగు జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావులకు ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులైన సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. పట్టణీకరణ పెరుగుతుండటంతో శాశ్వత ప్రాతిపదికన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ములుగు జిల్లా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన సీతక్క కలెక్టరేట్ నిర్మాణం చేపట్టాలని అభ్యర్థించారు. జిల్లా విద్యుత్ శాఖ అధికారిని నియమించాలన్నారు. దీంతో పాటు ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరారు. మల్లంపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలన్నారు. జిల్లా కేంద్రం ములుగు పట్టణంలో బస్‌స్టేషన్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్లోని క్యాథన్‌పల్లి మున్సిపాలిటీని ప్రజల కోరిక మేరకు రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా మార్చినందుకు మంత్రి కేటీరామారావుకు ఎమ్మెల్యే బాల్కసుమన్ ధన్యవాదాలు తెలిపారు. వాస్తవంగా క్యాథన్‌పల్లి మేజర్ గ్రామపంచాయతీ అని, రామకృష్ణాపూర్ పట్టణంగా అభివృద్ధిచెందిందన్నారు. రామకృష్ణాపూర్లో 18 వార్డులు ఉన్నాయని తెలిపారు. ప్రజలందరి కోరిక మేరకు ప్రభుత్వం రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా పేరు మార్చినందుకు అక్కడి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.