హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): పోలీసుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతున్నదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల భార్యలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పంతానికి పోతున్నదని ఎక్స్ వేదికగా పోస్టుచేశారు.
‘మొన్న నల్లగొండ, నిన్న వరంగల్, నేడు సిరిసిల్ల, డిచ్పల్లి పోలీస్ బెటాలియన్లలో ఆందోళన చేస్తున్న పోలీసు కానిస్టేబుల్ భార్యల ఆవేదన అరణ్య రోదనేనా? మూడు రోజులుగా వివిధ బెటాలియన్లలో పోలీస్ కానిస్టేబుళ్ల భార్య లు చేస్తున్న ఆందోళన ప్రభుత్వానికి పట్టదా? పోలీసు విధులు కాకుండా కూలి పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారంటూ 17వ బెటాలియన్ పోలీసు భార్యలు ఆందోళనకు దిగటం ప్రభుత్వానికి సిగ్గుచేటు. భార్యలు రోడ్డెకితే భర్తలను సస్పెండ్ చేస్తారా? ఎన్నికలకు ముందు రేవంత్రెడ్డి ఇచ్చిన ఏక్పోలీస్ నినాదం ఏమైంది? ప్రభుత్వ వైఖరిని మార్చుకొని ఆడబిడ్డల గోడు పరిషరించండి’ అంటూ తెలంగాణ సీఎం, తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేశారు.