Prakash Goud | మణికొండ, మే 26: కాంగ్రెస్ పార్టీపై సొంతపార్టీ నేతల నుంచే వ్యతిరేకత తీవ్రమవుతున్నది. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. సోమవారం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట కమ్యూనిటీ హాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గండిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేను నిలదీశారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు అటకెక్కించడం వల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నామని నిప్పులుచెరిగారు. గతంలో 60 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలని చెప్పి ఇప్పుడు 40 గజాలకే పరిమితం చేయడమేంటని నిలదీశారు. ప్రజాప్రభుత్వం అంటూనే ఏకపక్ష నిర్ణయాలతో అనర్హులకు ఇండ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడమేంటని గండిపేట మండల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను నిలదీశారు.
మమ్మల్ని పట్టించుకోకుండా ఇండ్లిస్తరా?
నార్సింగి మాజీ కౌన్సిలర్ ఉషారాణి మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రజాప్రతినిధులను, స్థానిక నాయకులను పట్టించుకోకుండా కొందరు నేతలకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఇండ్లు ఇచ్చుకోవడమేంటని మండిపడ్డారు. తమ గ్రామం నుంచి దరఖాస్తు చేసుకున్నవారిలో ఒక్కరిని కూడా ఎంపిక చేయకపోవడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలే నిలదీయడంతో కంగుతిన్న ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్.. వారి నుంచి మైకు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తున్నదని, అందరూ సహకరించాలని కోరుతూ సమావేశాన్ని ముగించారు.
పట్టా పొందినా నమ్మకంలేదు
ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడేమో 40 గజాలు స్థలంలోనే ఇల్లు కట్టుకోవాలని, నాలుగు దిక్కులా ఖాళీ జాగా ఉండాలని రూల్ పెట్టింది. 40 గజాల స్థలంలో నిర్మించే ఇంట్లో ఎలా ఉంటాం? రూల్స్ పేరుతో మంజూరైన పట్టాలను రద్దు చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారు. మేం పట్టాలు తీసుకున్నా ప్రయోజనం ఉంటుందని నమ్మకంలేదు
-ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, నార్సింగి