బాన్సువాడ, డిసెంబర్ 28 : ప్రజా పాలన పేరిట రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తుందని.. ఇదంతా పార్లమెంట్ ఎన్నికల పరకు కాలయాపన చేసేందుకేనని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను జాప్యం చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి మాటతప్పిందని అన్నారు. పంట పెట్టుబడి కింద రూ.15 వేలు అందిస్తామని చెప్పినా, పాత పద్ధతిలో రూ.10 వేలకు కూడా దిక్కులేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట మార్చడం సరికాదని అన్నారు. ప్రియాంక గాంధీ సభలో చెప్పిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ సర్కార్ ప్రజలకు కల్యాణలక్ష్మి , ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను ఎక్కడా ఆపలేదని గుర్తుచేశారు.
నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతులు వెంటనే వరినాట్లు పూర్తి చేయాలని, ఇప్పుడు నాట్లు వేయడంతో మార్చి చివరి నాటికి పంటలు కోత దశకు వస్తాయని ఎమ్మెల్యే పోచారం తెలిపారు. నిజాంసాగర్ నీటి విడుదల విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. నిజాంసాగర్ నీటి విడుదల 30 ఏండ్ల నుంచి కొనసాగుతున్నదని, ఇందులో రాజకీయ ప్రమేయం ఉందడని సూచించారు. చివరి ఆయకట్టుకు నీరందేలా రూ.150 కోట్లతో నియోజకవర్గంలో కాలువలు బాగుచేయించినట్టు తెలిపారు.