చేర్యాల, జూలై04: జనగామ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా నిర్వహించడం దురదృష్టకరమని, స్థానిక ఎమ్మెల్యే లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలతో వేదికను నింపి అధికారులు ఈ కార్యక్రమం నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేకుండా నిర్వహించకూడదన్నారు. ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి పట్టాలను పంపిణీ చేయడం సరైన పద్దతి కాదన్నారు. ఇందుకు కారణమైన అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల గురించి అర్హులైన వారికి కాకుండా ఇల్లు ఉన్న వారికి, అనర్హులకు ఇచ్చారని కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడడాన్ని మీడియా మొత్తం చూపించినట్లు తెలిపారు. ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధిగా కాకుండా ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేని ఒక అవివేకిగా అహంకారంతో బూతులు మాట్లాడినట్లు తెలిపారు. విమర్శ చేయడానికి ఏ జర్నలిస్టు మిత్రుడిని రాసి ఇవ్వమని అడిగిన రాసిస్తాడని తెలిపారు. భాష తెలియదు, భావం అంతకంటే తెలియదని, ఎంపీకి రాజకీయంగా బూతులు మాట్లాడడమే తెలుసునన్నారు.
ఇటువంటి కాంగ్రెస్ నాయకులు మొన్న జరిగిన మిస్ ఇండియా పోటిల్లో కూడా ఇదేవిధమైన ప్రవర్తన, భాషతో కించపర్చి ఆ పోటీలను అబాసుపాలు చేసినదాన్ని తెలంగాణ ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. మిస్ ఇండియా ప్రోగ్రాం అబాసుపాలు కావడానికి ఇలాంటి కాంగ్రెస్ నాయకులే కారణమన్నారు. జనగామ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఇటువంటి వాడిని ఎంపీగా ఎన్నుకున్నామా అని బాధపడుతున్నట్లు తెలిపారు. ఎంపీ వ్యాఖ్యల వల్ల సభ్య సమాజం తలదించుకుంటుందన్నారు. ఎంపీ మాట్లాడిన బూతు పంచాంగాన్ని జనగామ నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా మహిళలు అందరూ ముక్తకంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.