జనగామ, మే 13 (నమస్తే తెలంగాణ)/జనగామ రూరల్/ చేర్యాల, మే 13 : జనగామ జిల్లా కేంద్రంతోపాటు సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఉద్రిక్తతల నడుమ సోమవారం పోలింగ్ జరిగింది. జనగామలో అధికార కాంగ్రెస్ పార్టీకి పోలీసులు వత్తాసు పలకడం, కాంగ్రెస్ యూత్ నాయకుడితోపాటు పదుల సంఖ్యలో అనుచరులను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించడంపై బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం చెప్పడంతో ఇరు పార్టీ నేతల నడుమ వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అనుమతి పత్రం లేకున్నా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి, అతని అనుచరులను పట్టణంలోని ధర్మకంచ పోలింగ్ కేంద్రం గేటు లోపలికి పోలీసులు అనుమతించారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే పోలీసుల తీరును తప్పుపట్టారు. ఇదే విషయమై జనగామ ఏసీపీ అంకిత్, అర్బన్ సీఐ రఘుపతిరెడ్డిని నిలదీశారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో పోలింగ్ కేంద్రం ఆవరణలో ఉన్న కాంగ్రెస్ నాయకులను బయటకు పంపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు నినాదాలు, ప్రతి నినాదాలతో తోపులాటకు దిగి ఒకదశలో గొడవకు దారితీసింది. ఈ క్రమంలో తనపై రెండు చేతులువేసి నెట్టివేసేందుకు ప్రయత్నించిన ఏసీపీ అంకిత్‌పై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సీరియస్ అయ్యారు.
గానుగపహాడ్ గ్రామంలో సైతం ఓటేసేందుకు రోడ్డుపై ఉన్న ప్రజలను అర్బన్ సీఐ అకారణంగా లాఠీచార్జి చేశారని మండిపడ్డారు. పోలింగ్ సందర్భంగా జరిగిన సంఘటనలపై ఎన్నికల సంఘానికి, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. కాగా సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని బాలికల పాఠశాల, పెద్దమ్మగడ్డ పాఠశాల పోలింగ్ కేంద్రాల వద్ద అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పట్టణంలోని బాలికల పాఠశాల పోలింగ్ కేంద్రంలో కొంద రు అధికార పార్టీ నాయకులు లోనికి వెళ్లి ప్రచారం చేస్తున్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్లి అభ్యంతరం తెలిపారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారు. అదే సమయంలో కొందరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పల్లాతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకునే స్థ్ధాయికి చేరుకోవడంతో పలువురు జోక్యం చేసుకుని వారించే ప్రయత్నం చేసినప్పటికీ గొడవ తగ్గుముఖం పట్టలేదు. సుమారు గంటపాటు వాగ్వాదం, తోపులాట జరిగింది.