కరీంనగర్ కార్పొరేషన్, మే 3: ప్రజల భద్రత విషయంలో పోలీసులు, ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యం చూపుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించారు. దొంగల కాల్పుల్లో గాయపడి కరీంనగర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌తో కలిసి పరామర్శించారు. పోలీసులు నాకాబంధీ పేరుతో వాహనదారులను వేధించడం కాకుండా, అసాంఘిక శక్తులు ఎక్కడైనా తిరుగుతున్నారా? అని పరిశీలించాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో ఓ చిన్నపాప కిడ్నాప్ జరిగితే మూడు గంటల్లోనే సీసీ కెమెరాల సాయంతో పట్టుకున్నామని గుర్తుచేశారు.
సీఎం, బండిదే బాధ్యత: కౌశిక్‌రెడ్డి
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరిగిందంటే.. భద్రత ఉందా..? లేదా అన్న అనుమానం కలుగుతున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర హోంమంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ఇదేనా ప్రజలకు భద్రతా? అని ప్రశ్నించారు. ఈ ఘటనకు కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్‌రెడ్డిదే బాధ్యత అని పేర్కొన్నారు. సీపీని వెంటనే సస్పెండ్ చేయాలని, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దురదృష్టకర ఘటన: బండి సంజయ్
పీఎంజే జ్యువెల్లరీ షాపులో దొంగలు కాల్పులు జరిపి దాడికి పాల్పడటం దురదృష్టకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ విచారం వ్యక్తంచేశారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు కరీంనగర్‌ను జల్లెడ పడుతున్నారని, దుండగులను పట్టుకుంటారనే నమ్మకం ఉన్నదని చెప్పారు. ఘటనకు 10 నిమిషాల ముందే షాపు సమీపంలో అభివృద్ధి పనుల్లో పాల్గొన్నానని చెప్పారు. దుండగులు దొంగతనం చేయడానికే చొరబడినట్టు తెలుస్తున్నదని, సిబ్బంది అడ్డుకోవడంతో ఒక బ్యాగును వదిలి వెళ్లారని తెలిపారు. దోపిడీకి గురైన ఆభరణాల విలువ పోలీసుల విచారణలో తేలుతుందని అన్నారు.