హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ‘మా సభ్యత్వం రద్దవుతుందో లేదో కానీ.. ముందు అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చేసరికి మీ సభ్యత్వం ఉంటదో? ఉండదో? చూసుకోండి’ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘తెలంగాణ మహిళల కోసం మా సభ్యత్వం రద్దు చేస్తే అభ్యంతరం లేదు. మాదేమో కానీ అమెరికా వెళ్లి వచ్చేసరికి మీ ముఖ్యమంత్రి పదవి, మీ సభ్యత్వం రద్దు కావచ్చు చూసుకోండి. ఖమ్మం, నల్లగొండ మంత్రులు మీ సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారు.
ఆ బాంబు ఎప్పుడు పేలుతుందో చూసుకోండి’ అని సీఎం రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని అవమానించిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని, ప్రజా సమస్యలను లేవనెత్తే అవకాశం కల్పించడం లేదని ధ్వజమెత్తారు. హుజూరాబాద్ ప్రజలకు రెండోవిడత దళితబంధు నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించనేలేదని, ఆ ఘటనలో బాధితులకు తన వేతనం నుంచి రూ.4 లక్షలు అందజేశానని, ప్రభుత్వం రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని కోరారు.