హుజూరాబాద్, జూలై 22 : ఈటల రాజేందర్‌కు కేసీఆర్‌ను విమర్శించే స్థాయిలేదని, కేసీఆర్ పెట్టిన భిక్షతో పదవులు పొంది ఇప్పుడు ఆయననే విమర్శించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. ఈటల రాజేందర్ పెద్ద మోసగాడని, టికెట్ ఇచ్చి అన్నం పెట్టిన కేసీఆర్‌తోపాటు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను, నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేశారని ధ్వజమెత్తారు. మంగళవారం హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల రక్తాన్ని పీల్చి వందల ఎకరాలు కబ్జా చేస్తే దాన్ని సహించని కేసీఆర్ పార్టీ నుంచి వెళ్లగొట్టారని గుర్తుచేశారు. ఈటల బీసీ ముసుగులో ఉన్న దొర అని ధ్వజమెత్తారు. గుడ్లు అమ్ముకునే స్థాయి నుంచి బంగారు గుడ్లు అమ్ముకునే వరకు ఎలా ఎదిగారో తెలుపాలని ప్రశ్నించారు. హుజూరాబాద్ గడ్డ ఎప్పటికీ కేసీఆర్ అడ్డ అని స్పష్టం చేశారు. రానున్న గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి తీరుతామని చెప్పారు.