భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైన కాంగ్రెస్ పార్టీని ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అబద్ధాలు, విషపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందున్నది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు.
కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన కొత్తగూడెంలోని బీఆర్ఎస్ భవన్లో శనివారం నిర్వహించిన నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కొట్లాడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమేనని చెప్పారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్, బీజేపీ ఎంపీ లు ఏనాడూ పార్లమెంట్లో పెదవి విప్పలేదని విమర్శించారు. ప్రజలకు నీతులు చెప్పే రాహుల్‌గాంధీ సీఎం రేవంత్‌రెడ్డికి నీతివాక్యాలు చెప్పాలని సూచించారు. ఆర్టీసీలో మహిళల కు ఉచిత ప్రయాణం కల్పించి, ప్రత్యామ్నా య ఉపాధి చూపించకపోవడం వల్ల ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
వారి కుటుంబాలకు న్యాయం చేయకపోతే తమ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపిద్దామని పిలుపునిచ్చారు. 2018 ఎన్నికల్లో మాదిరిగానే ఖమ్మం ఎంపీ స్థానం నుంచి నామా అద్భుత విజయం సాధిస్తారని చెప్పారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు పాల్గొన్నారు.