మేడ్చల్/దుండిగల్, డిసెంబరు 18 : ప్రతిభ ఉండి, స్థోమత లేకుండా చదువుకోలేని విద్యార్థులకు పూణెకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ సైబేజ్ సాఫ్ట్వేర్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఉపకార వేతనాలను అందజేస్తుంది. ఆ సంస్థ నుంచి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ సెట్లోని 19 మంది ఫస్టియర్ విద్యార్థులకు రూ.19.5 లక్షల ఉపకార వేతనం మంజూరైంది. అలాగే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్‌లోని మర్రిలక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలకు చెందిన 14మంది విద్యార్థులు కూడా సైబేజ్ కుష్బూ స్కాలర్పిప్లను అందుకున్నారు.
చెక్కులను విద్యార్థులకు బుధవారం గచ్చిబౌలిలోని కంపెనీ కార్యాలయంలో సైబేజ్ సంస్థ చైర్మన్ రీతూ నతాని అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఆర్ఐటీ కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులకు సైబేజ్ సహకారం అందించడం అభినందనీయమని తెలిపారు. తమ అరుంధతి దవాఖాన ద్వారా ఉచితవైద్య సేవలను అందిస్తున్నామని, స్పోర్ట్స్ కోటా కింద విద్యార్థులకు ప్రతిఏడాది రూ.1.5కోట్ల స్కాలర్షిప్లను అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఫౌండేషన్ గత విద్యా సంవత్సరంలో రూ.8.6లక్షలు, ఈ ఏడాది రూ.10.55లక్షల మొత్తాన్ని స్కాలర్‌షిప్‌ల కింద అందజేసినట్టు సైబేజ్ సాఫ్ట్వేర్ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సురేశ్ మమునూరు, వైస్ ప్రెసిడెంట్ పుచ్చ వెంకటేశ్వర శర్మ, సీనియర్ సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ సురేశ్ గౌడ్, సీఎంఆర్ కళాశాల కార్యదర్శి గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ మేజర్ నారాయణ, చంద్రశేఖర్ రెడ్డి, ఎంఎల్ఆర్ఐటీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే శ్రీనివాస్‌రావు, ప్లేస్మెంట్ హెడ్లు రవిచంద్ర, డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి, అంజనా సరస్వతి తదితరులు పాల్గొన్నారు.