చేర్యాల, ఆగస్టు 27 : జనగామ-దుద్దెడ జాతీయ రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని ప్రధాన రహదారిపై రెండు గంటలపాటు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. జనగామ-దుద్దెడ జాతీయ రహదారి గుంతలమయంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
ప్రసూతి కోసం దవాఖానకు వెళ్లే ఆడబిడ్డలు రోడ్డు పైనే ప్రసవమయ్యే విధంగా రోడ్డు మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు దుస్థితిని చూసి పలుమార్లు తానే స్వయంగా మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడి మైనర్ రిపేర్లు చేయించినట్టు చెప్పారు. రోడ్డు పరిస్థితిపై కేంద్ర మంత్రికి నివేదిక ఇవ్వడంతోపాటు రూ.388 కోట్లతో నూతనంగా రోడ్డును నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు.
ఏడాది క్రితం నిధులు మంజూరు కాగా, ఆరు నెలల క్రితం టెండర్లు సైతం పూర్తి చేశారని, పనులు ప్రారంభించడం మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా జాతీయ రహదారుల మరమ్మతులు, నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, రోడ్ల పేరిట కేంద్రం రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. జనగామ-దుద్దెడ రహదారి పనులు ప్రారంభించే వరకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని, లేనిపక్షంలో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకొంటామని హెచ్చరించారు. అవసరమైతే ఢిల్లీలో సైతం దీక్ష చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.