మియాపూర్ , డిసెంబర్ 26 : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ స్వార్థం కోసం విజ్ఞత కోల్పోయి మాట్లాడొద్దని, ఆంధ్రా ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. ఇక్కడ నివసించేవారంతా తెలంగాణ బిడ్డలేనని, ప్రాంతాలవారీగా ప్రజలను విడదీసేలా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నాటి సీఎం చెన్నారెడ్డి సినీ పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
ప్రత్యేక ఆకాంక్షతో తెలంగాణ సాధించుకున్న తర్వాత తొలి సీఎం కేసీఆర్ అన్నిప్రాంతాల వారిని కండ్లల్లో పెట్టుకొని చూసుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రశాంతతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత ఫుట్‌పాత్‌లపై దుకాణాలు కోల్పోయిన బాధితులు ఎమ్మెల్యే కృష్ణారావును కలువగా.. ట్రాఫిక్ ఏసీపీతో ఫోన్లో మాట్లాడి పేదల దుకాణాలు తొలగించవద్దని సూచించారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
అనంతరం కేపీహెచ్‌బీ కాలనీ బస్టాప్‌లో వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందాడి శ్రీనివాస్‌రావు, పగడాల శిరీష, మాజీ కార్పొరేటర్ బాబూరావు, బీఆర్ఎస్ నియోజకవర్గ నేత సతీశ్ అరోరా తదితరులు పాల్గొన్నారు.