Tirumala | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను వారానికి రెండుసార్లు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లెటర్లు లీసుకోవడం లేదని, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన లేఖలు మాత్రమే అనుమతిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు గతంలో ప్రకటించారు. ఈ ప్రకటనపై పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులు తమను చిన్నచూపు చూస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో తాజాగా టీటీడీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల అంశాన్ని పునఃపరిశీలించింది. బోర్డులోని మెజారిటీ సభ్యులు సైతం లేఖలను పరిగణలోకి తీసుకోవాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేస్తారని, అప్పటి నుంచి మాత్రమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
టీటీడీ తెలంగాణ భక్తులను నిర్లక్ష్యానికి గురిచేయడం తగదని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లెటర్లను టీటీడీ స్వీకరించడం లేదని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి నేటి వరకు ఇది కొనసాగుతున్నట్టు తెలిపారు. ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. టీటీడీకి తెలంగాణ నుంచి అధిక రాబడి వస్తుందని, తెలంగాణలో ధర్మప్రచారానికి నిధులు కేటాయించాలని, దేవాలయాలు, కల్యాణమండపాల నిర్మాణానికి సహకరించాలని కోరారు. అయితే, సాయంత్రానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లను పరిగణించనున్నట్టు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తేతెలంగాణ) : జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి వైకుంఠద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించింది. భక్తులకు కేటాయించిన తేదీనే దర్శనానికి రావాలని సూచించింది. ఈ మేరకు అధికారులతో నిర్వహించిన సమీక్షలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. టోకెన్లు జారీ చేయనున్న కేంద్రాల్లో భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా పది రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. చంటిబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ దర్శనాలు, గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతిరోజూ 3.50 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. విశ్రాంతి గృహాల్లో వేడినీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.