గద్వాల: కారు గుర్తుపై గెలుపొంది కాంగ్రెస్కు మారిన ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి( MLA Krishnamohan Reddy) ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని గద్వాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు ( BRS leaders ) హెచ్చరించారు. పదవిని కాపాడుకోవడానికి తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పుకోవడం ఊసరవెల్లిని తలపించేలా ఉందని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ( Basu Hanmanth Naidu ) విమర్శించారు.
గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్లో ఉన్నానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గత సెప్టెంబర్ నెలలో కేటీఆర్ గద్వాల్ పర్యటనకు వచ్చినప్పుడు సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు?
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీ ఫోటో పెట్టుకొని గ్రామాలలో ఎందుకు ప్రచారం చేశారని అన్నారు. పార్టీ లోనే ఉంటే పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు, సభలకు ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు. ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో కూడా ప్రజలకు తెలియక నియోజకవర్గ ప్రజలు అయోమయంలో ఉన్నారని వివరించారు.
స్పీకర్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఉందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజారెడ్డి, బీచుపల్లి వెంకటేష్ నాయుడు, మోనేష్, శేఖర్ నాయుడు, గంజిపేట రాజు, తిమ్మప్ప గౌడ్, జాంపల్లి భరత్ సింహారెడ్డి, అంజి, రజినీబాబు, గంగాధర్, గోవర్ధన్, చిన్న యాదవ్, రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.