హైదరాబాద్: ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ట్యాంక్‌బండ్‌పై ధర్నాకు బీఆర్ఎస్ (BRS) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. అర్థరాత్రి నుంచే నాయకులను హౌస్ అరెస్టులు చేయడంతోపాటు అదుపులోకి తీసుకుంటున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వివేకానంద ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు.
అసలేం జరిగిందంటే..
బీఆర్ఎస్ ముఖ్యనేతలతో పాటు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కోసం వెళ్లిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపైనే కేసు పెట్టిన పోలీసులు, గురువారం ఆయనను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. ఇదేమిటని ప్రశ్నించి అడ్డుకున్నందుకు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డితో పాటు పలువురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలి స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. కౌశిక్‌రెడ్డిని నోటీసులిచ్చి బయటకు పంపకుండా రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో రాత్రి వరకు ఆయనను ఠాణాలోనే ఉంచారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలను నిరసిస్తూ సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఆందోళన చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు పలుచోట్ల లాఠీ ఝులిపించారు.
గురువారం తెల్లవారుజామునే కొండాపూర్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నివాసముంటున్న కొల్లా లగ్జరియా విల్లాస్ వద్ద బంజారాహిల్స్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా మోహరించారు. వీరికి తోడుగా గచ్చిబౌలి పోలీసులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వచ్చారని తెలిసి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి అక్కడికి చేరుకొని ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదంటూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో మరింతమంది బీఆర్ఎస్ శ్రేణులు కౌశిక్‌రెడ్డి ఇంటి వద్దకు చేరుకోకుండా విల్లాస్ ప్రధాన గేట్‌ను పోలీసులు మూసేయించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గేటు దూకి కౌశిక్‌రెడ్డి ఇంటి వద్దకు చేరుకొని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆందోళన నిర్వహించారు.
కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నారని సైబరాబాద్ పోలీసులు ముందస్తుగా హరీశ్‌రావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తదితరులను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పీఎస్‌కు, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి తదితరులను అరెస్ట్ చేసి రాయదుర్గం పీఎస్‌కు తరలించారు. ‘నాకు వారెంట్ చూపించాలి, నాపై ఏమేం కేసులు నమోదయ్యాయి? వాటిల్లో ఉన్న సెక్షన్లు ఏంటి? నా అరెస్టుకు స్పీకర్ అనుమతి ఇచ్చారా?’ అని కౌశిక్‌రెడ్డి పోలీసులను నిలదీశారు. పోలీసులు ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ఆయన బెడ్రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అయినా లెక్కచేయని పోలీసులు తలపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బలంతంగా వాహనం ఎక్కించి నేరుగా బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. మీడియాతో మాట్లాడనీయకుండా ఆంక్షలు పెట్టారు. అరెస్ట్ సందర్భంగా కౌశిక్‌రెడ్డి ఇంటి పరిసరాల్లో వందలాదిమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.