MLA KP Vivekananda Goud | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరిట ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న హైడ్రా విధానంతో గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధి, శివారు మున్సిపాల్టీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్కు చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంత డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సోమవారం పద్దులపై జరిగిన చర్చలో వివేకానంద మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణకు సంబంధించిన డీపీఆర్‌ను అందజేయాలని, ఎప్పటిలోగా పూర్తిచేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం వరదల ముంపునకు పరిష్కారంలో ఎస్ఎన్డీపీని చేపట్టిందని, ఎస్ఎన్డీపీ ఫేజ్ 2ను కూడా ప్రారంభించాలని కోరారు. ట్రాఫిక్ సమస్య నివారణకు గత ప్రభుత్వం అమలు చేసిన ఎస్ఆర్డీపీ పాలసీని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాల రీత్యా సుంకిశాలను సత్వరమే పూర్తిచేయాలని, అందుకు అదనంగా నిధులు కేటాయించాలని సూచించారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని, ఎక్సైజ్ షాపుల కేటాయింపులో 30శాతం గౌడ కమ్యూనిటీకి రిజర్వ్ చేయాలని డిమాండ్ చేశారు.