ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, ఫిబ్రవరి 3: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభకు రేవంత్ సీఎం హోదాలో వచ్చి కేవలం రూ.కోటి మంజూరు చేసి, సభకు మాత్రం రూ.5 కోట్లు దుబారా చేశారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు. 2014లో మొదటిసారి సీఎం హోదాలో వచ్చిన కేసీఆర్ రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. రెండోసారి వచ్చినప్పుడు కుమ్రంభీం పేరిట జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. ఈ ప్రాంతానికి ఎంతో చేసిన కేసీఆర్పై రేవంత్ నోరుపారేసుకోవడంపై ఆమె మండిపడ్డారు. శనివారం ఆమె జిల్లా కేంద్రంలో మాట్లాడారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ చూస్తుంటే కాల్చి చంపినవారే కన్నీరు పెట్టినట్టుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాం లో మంజూరు చేసిన నిధులను, తాము చేసినట్టుగా గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రంలోని బీజేపీపై చిన్న మాట కూడా మాట్లాడలేదని ధ్వజమెత్తారు.