సిద్దిపేట : దుబ్బాక నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు, నూతన రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA Kotha Prabhakar Reddy) ఆదేశించారు. నియోజకవర్గంలోని మంజూరైన రోడ్ల అభివృద్ధి పనులను, అలాగే కొత్త రోడ్ల మంజూరు కోసం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో ట్రాఫిక్ దృష్ట్యా దుబ్బాక చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
దుబ్బాక మండల హబ్సిపూర్ నుంచి దుబ్బాక వరకు డబుల్ రోడ్ను ఫోర్ లైన్ రోడ్గా, మిరుదొడ్డి మండలంలోని అందె గ్రామం నుంచి దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ వరకు డబుల్ రోడ్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో జరుగుతున్న రోడ్ల పనులను అడిగి తెలుసుకున్నారు. దశల వారీగా నియోజకవర్గంలో రోడ్ల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. సమీక్షలో ఆర్ అండ్ బీ ఈఈ బాలప్రసాద్, దుబ్బాక డీఈ వెంకటేశం, దౌల్తాబాద్ ఏఈఈ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.