Komatireddy Rajagopal Reddy | హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): మంత్రి పదవి కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని అనుమానిస్తున్న పార్టీలోని పలువురు కీలక నేతలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల నల్లగొండలో జరిగిన ఒక కార్యక్రమంలో మం త్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉన్నదని వ్యాఖ్యానించారని, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఒక కార్యక్రమానికి స్వయంగా ఆహ్వానించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
నల్లగొండ జిల్లా రాజకీయాల్లో ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబా ల మధ్య రాజకీయ సంబంధాలు అంతంత మాత్రమే. అయితే, ఏఐసీసీ ఉత్తమ్ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తుండటం, ఆయనను మచ్చిక చేసుకొనేందుకు పొగుడుతున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. మరోవైపు గుత్తా, కోమటిరెడ్డి కుటుంబాల మధ్య కూడా సఖ్యత లేదు. అయితే, అందరితో మంచిగా ఉండటం ద్వారా రాబోయే రోజుల్లో మంత్రి పదవి పొందడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవనే ఉద్దేశంతోనే గుత్తాతో కూడా స్నేహసంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సీనియర్ నేత జానారెడ్డి రాసిన లేఖ వల్లే తనకు మంత్రిపదవి రాకుండా పోయిందనే ఉద్దేశంతో ఆయనపై రాజగోపాల్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జానారెడ్డి నేరుగా స్పందించకపోయినా.. అధిష్ఠానం ఈ వ్యాఖ్యలపై వివరణ కోరినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. దీంతో జానారెడ్డి అంటే తనకు చాలా గౌరవమని, వ్యక్తిగతంగా ఆయనను విమర్శించలేదని రాజగోపాల్‌రెడ్డి చెప్పుకున్నారు. ఆ తర్వాత మళ్లీ జానారెడ్డిని మచ్చిక చేసుకునేందుకు ఆయన తనయులు ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారని, జానారెడ్డితో రాజగోపాల్‌రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన అనుచరులు చెప్తున్నారు.