హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణను అమ్మేస్తడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. బ్లాక్మెయిల్ రాజకీయాలతో డబ్బులు సంపాదించి పీసీసీ పదవిని చేపట్టిన రేవంత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి.. రాష్ర్టాన్ని దోచుకోవాలని ఎత్తుగడ వేస్తున్నారన్నారు. సోనియాను బలిదేవత అన్నోడికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకే రేవంత్‌రెడ్డి ఉన్నాడని పేర్కొన్నారు. అందువల్లే తాను కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని మంగళవారం మీడియా ముందు ప్రకటించారు. బీజేపీలో చేరుతున్నట్టు సంకేతాలిచ్చారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని 20 ఏండ్లపోటు తిట్టిన రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారన్నారు. ఏ వ్యాపారమూ చేయని రేవంత్‌రెడ్డికి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్‌చేసి సంపాదించిన సొమ్ముతో పీసీసీ పదవి తెచ్చుకొన్నారని, కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయి తెలంగాణ రాష్ర్టాన్ని దోచుకోవాలనే ఎత్తుగడతోనే రేవంత్ ఉన్నారని ఆరోపించారు. రేవంత్‌లాంటి వాళ్ల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ నాశనమైందని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌లో తనకు ఆత్మగౌరవం లేదని, నాలుగైదు పార్టీలు మారి, ప్రజల ముందు నోట్ల కట్టలతో దొరికి జైలుకు వెళ్లిన వారి కింద పనిచేయలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు.
మోదీ, అమిత్‌షా విసిరిన కుక్క బిస్కట్ల కోసమే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తమ ఆర్థిక అవసరాల కోసం మోదీ,అమిత్ షా వేసిన ఎంగిలి మెతుకుల కోసం రాజకీయంగా జన్మనిచ్చిన కాంగ్రెస్‌పై రాజగోపాల్‌రెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు బద్ధశత్రువుగా మారిన మోదీని తెలంగాణ సమాజం బహిష్కరించాలని రేవంత్ కోరారు. కోమటిరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని హోదాలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ వల్లే వాళ్లకు బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని పేర్కొన్నారు. కొసమెరుపేమిటంటే.. ఎమ్మెల్యే రాగోపాల్రెడ్డి రాజీనామా ప్రకటించగానే ఏఐసీసీ మునుగోడు ఎన్నిక కోసం ప్రచార, వ్యూహ కమిటీని నియమించింది. ఇందులో నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చోటు కల్పించలేదు.