హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని అధికార పార్టీకి చెందిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అసెంబ్లీలో గగ్గోలుపెట్టారు. కల్వకుర్తి, జడ్చర్ల, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందడంలేదని వాపోయారు. 15 రోజులుగా 100 కి.మీ కాలువ పూర్తిగా ఎండిపోయిందని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. దీంతో కోతకొచ్చిన వేరుశనగ పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఒకట్రెండు రోజల్లో నీటిని విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు. 15 రోజులపాటు నీటిని విడుదల చేస్తే పంటలు కాపాడుకొనే అవకాశమున్నదని పేర్కొన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఎక్కువ నీటిని వనపర్తి నియోజకవర్గమే వాడుకుంటున్నదని తెలిపారు. లిఫ్ట్‌లో మూడు మోటర్లు మాత్రమే నడుస్తున్నాయని, దీంతో.. ఎగువనున్న నియోజకవర్గాలకు నీరు అందడంలేదని వాపోయారు.