హైదరాబాద్: ఆరు గ్యారంటీల పేరుతో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రతి నెల రూ.4 వేల చొప్పున భృతి ఇస్తామని హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ సభలో ప్రియంక గాంధీ చెప్పారని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా దానిని పొందుపర్చారని గుర్తుచేశారు. అయితే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాత్రం నిరుద్యోగ భృతి గురించిన హామీ తాము ఎక్కడా ఇవ్వలేదంటున్నారని విమర్శించారు.
రైతులకు రూ.2 లక్షల పంట రుణాలను డిసెంబర్ 9న మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని ఇప్పటివరకు అమలుచేయడం లేదని దుయ్యబట్టారు. మద్దతు ధరకు రూ.500 బోనస్ ఇచ్చిమరి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారని.. ఈరోజు వరకు ఎక్కడా కొనుగోలు చేసిన దాఖలా లేదని చెప్పారు. ఈ మూడు హామీలకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిందన్నారు. ఎలాంటి హామీ ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పే ప్రయత్నం చేస్తున్నది ఆరోపించారు. ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేయాలని డిమాండ్ చేశారు. దానికి తాము పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలుకు సంవత్సరమైనా ఓపికపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ఆదాయ వనరులపై సమీక్ష లేకుండా అలవికాని హామీలిచ్చారని విమర్శించారు.