ఖలీల్‌వాడి జనవరి 26: రేవంత్‌పాలన అట్టర్ ఫ్లాప్ అని, ఏడాదికే కాంగ్రెస్ గ్రాఫ్ కుప్పకూలిపోయిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. హామీల అమలులో ప్రజలకు సర్కారు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు ప్రజలను మోసగిస్తున్నదని, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రోజుకో నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 13 నెలల కాలంలో రేవంత్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, అడుగేస్తే మోసాలు అని, కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణకు మళ్లీ అంధకారం దాపురించిందని నిప్పులు చెరిగారు. ఇందిరమ్మ రాజ్యమంటే మీ ఇష్టారాజ్యమా ? అని మండిపడ్డారు.
రుణమాఫీ చేశామని వ్యవసాయశాఖ మంత్రి, అమలు కాలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి తలోతీరు అంటున్నారని మండిపడ్డారు. మంత్రి పొంగులేటిది ఒక దారైతే ఉపముఖ్యమంత్రి భట్టిది మరో దారి అని పేర్కొన్నారు. మండలానికో గ్రామానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు వస్తాయని భట్టి విక్రమార్క అంటున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ సోనియాగాంధీని నిన్నటి వరకు బలి దేవత అని, నేడు తెలంగాణ దేవత అంటున్నారని ఎద్దేవాచేశారు. హామీలన్నీ అమలు చేస్తే, ప్రజలు గ్రామసభల్లో కాంగ్రెస్ డొక్క చింపి డోలు ఎందుకు కడుతున్నారని ప్రశ్నించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి చెప్పేవి జోకర్ మాటలని, చేసేవి బ్రోకర్ పనులని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు పుట్టి పెరిగిన గ్రామాల్లో ఎన్నికల హామీలు నూరు శాతం అమలు జరిగాయని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేకుంటే కాంగ్రెస్ నేతలు రాజకీయాల నుంచి తప్పుకుంటారా ? అని సవాల్ విసిరారు.