హాలియా, ఏప్రిల్ 4: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు పాలనను గాలికొదిలేసి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలోని హిల్‌కాలనీలో కోతులు పడి మృతిచెందిన వాటర్ ట్యాంకును గురువారం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నోముల భగత్కుమార్తో కలిసి ఆయన పరిశీలించారు. కలుషితమైన నీటిని తాగిన ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని ప్రజ లు ఇబ్బందులు పడుతుంటే.. వా టి నివారణకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వ పెద్దలు నిమ్మకు నీరేత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లాది మందికి తాగునీరు అందిస్తున్న నాగార్జునసాగర్ ప్రాజె క్టు పక్కనే ఉన్నా 2014కు ముందు నందికొండ ప్రజలకు తాగేందుకు మంచినీళ్లు లేని పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నందికొండ మున్సిపాలిటీ ఏర్పాటు చేయడంతోపాటు ప్రజలకు తాగునీటిని అందించామని గుర్తుచేశారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో.. తాగునీరు అందించే వాటర్ ట్యాంకులను నిత్యం తనిఖీ చేసే సమయం కూడా అధికారులకు లేకుండా పోయిందని విమర్శించారు. ట్యాంకులో కోతులు పడి చనిపోయినప్పటికీ అదే నీటిని సరఫరా చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు.