హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): రైతు భరోసా పేరిట చేసిన మోసం నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఫార్ములా-ఈ కేసును తెరపైకి తెచ్చారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్కారు వైఫల్యాలను అడుగడుగునా ఎండగడుతున్నందుకే కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు, పొలాలకు నీళ్లు, 24 గంటల కరెంటు ఇచ్చి సంబురాలు చేసుకొంటే, కాంగ్రెస్ నాయకులు కేసులు పెట్టి సంబురాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ఇద్దరు, ముగ్గురు తాబేదార్లయిన అధికారులను అడ్డంపెట్టుకుని ప్రతిపక్షాన్ని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
మంగళవారం ఆయన నందినగర్‌లోని కేటీఆర్ నివాసం వద్ద మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఎగ్గొట్టిన రైతు భరోసాపై ప్రజల్లో జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించేందుకే చెత్త కేసులను తెరపైకి తెస్తున్నారని దుయ్యబట్టారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న సీఎంకే ఫార్ములా-ఈ కేసు చుట్టుకుంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో నిలిపితే, రేవంత్‌రెడ్డి అన్నింటా అధోగతిపాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్కు ఫార్మర్స్ కావాలని, కాంగ్రెస్‌కు మాత్రం ఫార్ములా-ఈ కేసు కావాలని చురకలంటించారు.
ఏసీబీ విచారణకు కేటీఆర్ లాయర్‌తో వస్తే ఇబ్బందేమిటని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో లాయర్‌తో విచారణకు హాజరైన రాహుల్‌గాంధీకి ఒక న్యాయం? కేటీఆర్‌కు మరో న్యాయమా? అని నిలదీశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన కేటీఆర్‌ను నగరవాసులు గుండెల్లో పెట్టి చూసుకుంటారని, ఆయనపై ఉన్న అభిమానాన్ని తప్పుడు కేసులతో చెరిపివేయలేరని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా న్యాయమే గెలుస్తుందని, కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటికి వస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేతల కంటే ముందు బీజేపీ నాయకులు స్పందించడం చూస్తుంటే వారిద్దరు తోడు దొంగలనే విషయం అర్థమవుతున్నదని, మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
దేశంలోని అన్ని పార్టీల్లాగే బీఆర్ఎస్ కూడా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. గ్రీన్కో నుంచి అదే పద్ధతిలో నిధులు తీసుకున్నామని చెప్పారు. ఇందులో అవినీతికి ఆస్కారమెక్కడిదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఫార్ములా-ఈ ఒప్పందంలో గోల్మాల్ జరిగిందంటూ కేటీఆర్‌పై లొట్టపీసు కేసు పెట్టారని ఆరోపించారు. ఈ కేసు ముసుగులో రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 15 నెలల క్రితం ఒప్పందం కుదుర్చుకొని నగదు చెల్లింపులు జరిగితే, ఇప్పుడు కేసు నమోదు చేయడాన్ని చూస్తే కుట్రకోణం అర్థమవుతున్నదని పేర్కొన్నారు. ప్రధాని మోదీని కాదని ఫార్ములా-ఈ రేస్ తెచ్చి హైదరాబాద్ ఇమేజ్ను పెంచిన కేటీఆర్‌పై బట్టకాల్చి మీదేస్తే సహించబోమని హెచ్చరించారు. సర్కారు కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులను రాజ్యాంగబద్ధంగానే చిత్తుచేస్తామని స్పష్టంచేశారు.