ఖైరతాబాద్, సెప్టెంబర్ 15: ‘వినాయకా.. రాష్ట్ర ప్రజల విఘ్నాలు తొలగించు.. తుఫాన్, వరదలతో, సీజనల్ వ్యాధులతో అవస్థలు పడుతున్న ప్రజలు ఆయురారోగ్యాలతో ఉం డాలి అని రెండు చేతులు జోడించి మొక్కుకున్నా’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిని ఆదివారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ఆయనకు ఘనస్వాగతం పలికింది. మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు. ప్రపంచంలోనే ఖైరతాబాద్ మహాగణపతి అత్యంత ప్రాచుర్యం పొందిందన్నారు. 70 ఏండ్ల నుంచి నిరాటంకంగా నవరాత్రోత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కేసీఆర్ హయాంలో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నవరాత్రోత్సవాలు, శోభాయాత్రలు నిర్వహించామని, అదే తీరులో ప్రస్తుత ప్రభుత్వం ఉత్సవాలు జరిగేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం పూర్వజన్మ సృకుతంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ నేతలు గజ్జెల నగేశ్, రావుల శ్రీధర్‌రెడ్డి, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.
ఖైరతాబాద్‌కు పోటెత్తిన భక్తజనం
హైదరాబాద్ నడిబొడ్డున ఖైరతాబాద్‌లో కొలువుదీరిన సప్తముఖ మహాశక్తి గణపతి దర్శనానికి చివరిరోజైన ఆదివారం భక్తులు అశేష సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు సుమారు ఐదు లక్షలకు పైగా భక్తులు వచ్చినట్టు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. మహాగణపతి దర్శనం కోసం ఒక్కసారిగా లక్షలాది మంది తరలిరావడంతో వారిని అదుపు చేయలేని పరిస్థితి నెలకొన్నది. రాత్రి 12 గంటలకు వరకు ఏడు లక్షలకు పైగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. నేడు దర్శనాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్టు, భక్తులు ఎవరూ రావద్దని పోలీసులు ముందస్తుగా ప్రకటించారు. మహాగణపతిని దర్శించుకొని ఐమాక్స్, మింట్ కాంపౌండ్‌కు వెళ్లే దారుల్లో భక్తుల మధ్య తోపులాటలు చోటుచేసుకోగా పలువురు వృద్ధులు, మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు పోలీసుల తరమూ కాలేదు.బాధితులకు భక్తులే సపర్యలు చేశారు.