Harish Rao | హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): మందబలం ఉన్నదని సభను సీఎం రేవంత్‌రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షమైన తమకు మైక్ కూడా ఇవ్వకుండా, క్లారిఫికేషన్ తీసుకోకుండా సభను వాయిదా వేసుకొని పారిపోవటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్తు స్మార్ట్‌మీటర్ల అంశంలో ప్రజలను సీఎం తప్పుదోవ పట్టించి తమను వివరణ ఇవ్వనీయలేదని ఫైరయ్యారు. బోడిగుండుకు, మోకాలుకు లింక్ పెట్టి ప్రజలకు అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. శనివారం రాత్రి సభ వాయిదా అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం ఉదయ్ పథకాన్ని రాష్ట్రం మీద బలవంతంగా రుద్దింది. మీటర్లు పెడుతున్నట్టు సంతకాలు పెట్టినం అని చెప్తుండగానే మైక్ కట్ చేశారు.
ఉదయ్ పథకంలో 27 రాష్ర్టాలు చేరాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ వంటి రాష్ర్టాలు కూడా చేరాయి. ఇందులో ఏముందంటే వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు మినహాయించి 500పైగా యూనిట్ల విద్యుత్తు వాడే పరిశ్రమలకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని ఉన్నది. మేము కూడా ఈ పథకంలో చేరాము. కానీ, ఎక్కడా ఇప్పటివరకు స్మార్ట్‌మీటర్లు పెట్టలేదు. ఇక, నేను చెప్తున్న నోట్.. 2021 జూన్ 9 నాటిది. ఇందులో ఏముందంటే ఏ రాష్ట్రాలైతే ఎంఆర్‌బీఎం పరిధిలో 0.5 శాతం అప్పు తీసుకోవాలనుకుంటున్నాయో మీ ప్రతిపాదనలు పంపండి అని కేంద్రం కోరింది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించి ఉంటే రాష్ట్రానికి రూ.30 వేల కోట్లు వచ్చేవి. కానీ, రైతుల ప్రయోజనాల కోసం మేం అందుకు ఒప్పుకోలేదు.
ఇదే మేం చెప్పినం. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం ఉదయ్ స్కీమ్‌తో ఎఫ్ఆర్బీఎం రుణ వ్యవహారానికి లింకు పెట్టి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీటర్లు పెడుతున్నట్టు సంతకాలు పెట్టిందని, అధికారులు పెట్టారని సీఎం మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. నేను చెప్పింది ఒకటి సీఎం మాట్లాడింది మరొకటి. మందబలం ఉన్నదని సభను, ప్రజలను సీఎం తప్పుదోవ పట్టిస్తున్నరు. బోడిగుండుకు మోకాలుకు లింక్ పెట్టారు. సభా నాయకుడు మా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సీఎం మోటర్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నారేమో అని అనుమానంగా ఉన్నది. ఇప్పటికీ మేము స్మార్ట్ మీటర్ కూడా పెట్టలేదు. రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం’ అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.