Harish Rao | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఉద్యోగార్థులు పోస్టుల సంఖ్య పెంచాలని అధికార పార్టీ నాయకుల కాళ్లు పట్టుకొనే పరిస్థితి రావడం దురదృష్టకరమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. విపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టడం, అధికారంలోకి రాగానే విస్మరించటం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అని ఆరోపించారు. గ్రూప్-1 మెయిన్‌కు 1:100 అర్హతను పరిగణించాలని, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు నాయకుల కాళ్లు పట్టుకొని వేడుకోవడం బాధాకరమని శుక్రవారం ఆయన ఎక్స్‌వేదికగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్-1 మెయిన్‌కు 1:100 అర్హతను పరిగణించాలని కోరిందని, అధికారంలోకి రాగానే ఎందుకు మరిచిపోయిందని ప్రశ్నించారు.
25వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల హామీగా చెప్పిన కాంగ్రెస్.. 11 వేల పోస్టులు మాత్రమే వేసి చేతులుదులుపుకున్నదని ధ్వజమెత్తా రు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఆరు నెలలు గడుస్తున్నా ఎలాంటి ప్రణాళిక రూపొందించకపోవడం మోసం చేయడమేనని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన పోస్టులకు నియామక పత్రాలు అందించి, 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకోవడం తప్ప, యువత, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రూప్స్ అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య పెంచడంతోపాటు, ఎన్నికల మ్యానిఫెస్టోలో యువతకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని హరీశ్‌రావు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ 191 రోజులు గడిచినా ఆచరణలో మాత్రం విఫలమైందని ఆయన ఎక్స్ వేదికగా ఎత్తిచూపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా, వృద్ధులు, వితంతువుల పింఛన్లు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పెంచుతూ తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. పక రాష్ట్రం ఏపీలో అధికారంలోకి రాగానే అక్కడి ముఖ్యమంత్రి అన్ని రకాల పింఛన్లు పెంచారని, ఒరిస్సా ముఖ్యమంత్రి వరి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.3100 చేస్తూ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. పది శాతం మాత్రమే పండించే సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చేతులు దులుపుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో చెప్పినట్టుగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన 6 గ్యారెంటీలు, 13 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.