MLA Gangula Kamalaker | హైదరాబాద్ : బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు.. బహుజన రాష్ట్ర సమితి అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ బిల్లు తీసుకొచ్చి ఆ తర్వాత జీవో ఇచ్చి బీసీలకు అన్యాయం చేయొద్దు.. షెడ్యూల్ 9లో బీసీ రిజర్వేషన్లను చేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. బీసీ బిల్లుపై చర్చ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడారు.
బీసీ బిల్లు అమలును తమిళనాడు తరహాలో శాస్త్రీయ పరంగా చేయండి, అశాస్త్రీయంగా చేస్తే బీహార్, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల్లో ఫెయిల్ అయినట్లుగా అవుతుందని, వెనుకబడిన కులాలను మోసం చేయవద్దని ముందునుంచి చెప్తున్నాం.
అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యాక జీవో ఇవ్వాలంటే.. మరి ఈ ఇరవై రెండు నెలల కాలంలో ఏం చేశారు? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఇస్తామని చెప్పారు కదా, ఆదే రోజు జీవో ఇవ్వకుండా సుమారు ఆరు కమిటీలు ఎందుకు వేశారు? అని గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
బీసీ రిజర్వేషన్లను మేం స్వాగతిస్తాం. గతంలో పంపించిన బిల్లుల మాదిరిగా కావొద్దు. మా సూచనలు పరిగణనలోకి తీసుకోండి. జీవో న్యాయస్థానాల్లో నిలబడదు. రాజ్యాంగ పరిధిలో 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే న్యాయం జరుగుతుంది. తమిళనాడులో జయలలిత చేసిన తరహాలో ఆలోచన చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాను. గతంలో కూడా బిల్లులు పంపిస్తే రాలేదు.. అందుకే మా సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నాను. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. జయలలిత మాదిరిగా చేయాలని కోరుతున్నాం. శాపనార్థాలు పెట్టడం లేదు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుతున్నాం. బీహార్ దిశలో పోవద్దు.. తమిళనాడు దిశలో పోవాలి అని గంగుల కమలాకర్ సూచించారు.
బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు బహుజన రాష్ట్ర సమితి.. అని పేదలు అంటున్నారు. 42 శాతం రిజర్వేషన్లు రావాలంటే న్యాయవ్యవస్థల్లో చిక్కులు రాకూడదు. బిల్లు పాస్ చేసుకుని జీవో తెచ్చి ఎన్నికలకు పోతే చిక్కులు వస్తాయి. మా సూచనలను విమర్శగా భావించకుండి. 2 కోట్ల మంది భవిష్యత్ ఇది.. భావితరాలు అన్యాయం కావొద్దని చెబుతున్నా. చిత్తశుద్ధి ఉంటే డెడికేటెడ్ కమిటీ వేయాలి. కానీ జీవో ఇచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థలో చిక్కు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.