హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఒక్కసారిగా స్విచ్ఛాఫ్ చేసినట్టు ఆగిపోయిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. నిధులు విడుదల కాక అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే మానేరు రివర్ ఫ్రంట్ పనులు 90 శాతం పూర్తయ్యాయని, ఏడాది కాంగ్రెస్ పాలనలో తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా ప్రజలపై రేవంత్‌రెడ్డికి ఎందుకింత కక్ష అని నిలదీశారు. తెలంగాణభవన్‌లో గురువారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు డాక్టర్ కే సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, పార్టీ నేతలు రూప్సింగ్, పన్నాల భూపతిరెడ్డితో కలిసి గంగుల మీడియాతో మాట్లాడారు.
నిన్న సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడకు వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఏవైనా నిధులు, వరాలు ప్రకటిస్తారని ఆశించామని, కానీ, ఆయన అభివృద్ధి ఊసే ఎత్తలేదని విమర్శించారు. ఎంతసేపూ కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామనడం తప్ప రేవంత్ కొత్తగా చెప్పిందేమీ లేదని ఎద్దేవాచేశారు. కేసీఆర్ పేరు చెరిపేసేందుకు బ్లాక్ బోర్డు మీద రాసిన చాక్‌పీస్ రాత కాదని, కేసీఆర్ పేరు తెలంగాణ ప్రజల గుండెల్లో సువర్ణాక్షరాలతో లిఖించి ఉన్నదని చెప్పారు. భూమి, నీరు ఉన్నంత వరకు కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం మీద కాకుండా అభివృద్ధి మీద రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టాలని హితవుపలికారు. కోకాపేటలో బీసీలకు కేసీఆర్ 82 ఎకరాలు కేటాయించారని, కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాదిన్నరైనా ఏం చేసిందని నిలదీశారు. 29న కరీంనగర్లో దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.
రేవంత్ చేసిందేంది?: పాడి
ఏడాది పాలనలో రేవంత్‌రెడ్డి చేసింది ఏమిటని? కేసీఆర్ పథకాలను బంద్ పెట్టడం తప్ప కొత్తగా ఏం పథకాలు అమలు చేశారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నిలదీశారు. మహబూబాబాద్‌లో అంతమంది పోలీసుల కవాతు దేనికని, కేటీఆర్ మీటింగ్‌కు పర్మిషన్ ఇవ్వడానికి రేవంత్‌కు భయమెందుకని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పేరు లేకుండా ఈ ఏడాదిలో రేవంత్‌రెడ్డి ఏ మీటింగయినా పూర్తిచేశారా? అని ప్రశ్నించారు. ‘రేవంత్ కూర్చుంటున్న సచివాలయం కేసీఆర్ కట్టించింది కాదా? రేవంత్ సెటిల్మెంట్లకు వాడుకుంటున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కేసీఆర్ కట్టించింది కాదా? తెలంగాణలో ఎకడైనా కేసీఆర్ ఆనవాళ్లే ఉంటాయి.. వాటిని తొలగించడం రేవంత్ వల్ల అవుతుందా?’ అని చురకలంటించారు. విజయోత్సవాల పేరుతో గ్రామాల్లో వాహనాలను తిప్పుతున్నారని, ప్రజలు కొడతారనే భయంతో కళాకారులు ఎక్కడా వాటిని ఒక్క నిమిషం కూడా ఆపడం లేదని ఎద్దేవాచేశారు. రెండో విడత దళితబంధు నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు. వేములవాడ సభలో సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ కుటుంబంపై చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు.
రేవంత్‌ను ప్రజలు తిడుతున్నరు: కొప్పుల
తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ప్రజల చేత ఇన్నితిట్లు తిట్టించుకుంటున్న సీఎంను చూడలేదని, రేవంత్‌రెడ్డిని ప్రజలు ఘోరంగా తిడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఏదో అనుకొని కాంగ్రెస్‌కు ఓటేశామని ఇప్పుడు ప్రజలంతా బాధపడుతున్నారని చెప్పారు. మాట్లాడితే అరెస్టులు చేస్తామంటున్న రేవంత్‌రెడ్డి.. దమ్ముంటే తమ బీఆర్ఎస్ నేతలను ఎప్పుడు, ఎక్కడ, ఏ కేసులో అరెస్టు చేస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. వేములవాడ, సిరిసిల్ల రూపురేఖలు మార్చిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. ‘50 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు.. నోటిఫికేషన్లు కేసీఆర్ ఇచ్చారా? రేవంత్ ఇచ్చారా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో దౌర్జన్యంగా భూ సేకరణ జరగలేదని, రైతులను ఒప్పించి మెప్పించి సేకరించారని గుర్తుచేశారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన 14 వేల ఎకరాలు ఉండగా, మళ్లీ ఫార్మాకు భూ సేకరణ ఎందుకు? అని నిలదీశారు.