Premsagar Rao | మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 14 : ‘ఇరవై ఏండ్లుగా పార్టీని పట్టుకొని ఉ న్నా.. కష్టకాలంలో కూడా పార్టీని నడిపించిన.. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడినా.. ఇంద్రవెల్లి, మంచిర్యాల సభలను నా భు జాలపై వేసుకుని విజయవంతం చేసిన.. ఇప్పుడు నన్ను కాదని నిన్న.. మొన్న వచ్చిన వారికి పదవులు ఇస్తానంటే కుదరదు’ అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరా ల ప్రేంసాగర్‌రావు కుండబద్దలు కొట్టారు. సోమవారం మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, జైబాపు, జైభీం, జై సంవిధాన్ బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఎదుట ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తనకు అన్యాయం చేస్తే భరిస్తాను కానీ.. ఈ జిల్లాకు, నోరులేని అడవి బిడ్డలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. 74 ఏండ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందని, ఆదివాసీల పక్షాన మాట్లాడే తన గొంతు నొక్కాలని చూడొద్దని ఆవేదనగా అన్నారు. ‘ఇప్పటికే పార్టీలు మారి.. నిన్న మొన్ననే ఈ పార్టీలో కి వచ్చారు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం వాళ్లు పదవులు అడుగుతున్నారు.. వాళ్లకు పదవులు ఇస్తే పార్టీకి నష్టం తప్పదు’ అని చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్, ఎంపీ వంశీలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు అన్యాయం చేస్తే సహించేది లేదని మరోమారు స్పష్టంచేశారు.
అంతకుముందు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ.. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై అక్కసు వెళ్లగక్కారు. ఐటీ పార్కు పోతుందని ‘నమస్తే తెలంగాణ’లో ఏదో రాశారట, దాని సంగతి శ్రీధర్‌బాబు చెబుతారని అన్నారు. వాస్తవానికి ఐటీ పార్కు పోతుందని ‘నమస్తే తెలంగాణ’లో ఎక్కడా రాయలేదు. ఐటీ, ఇండస్ట్రియల్ పార్కుకోసం సేకరిస్తున్న భూముల విషయంలో జరుగుతున్న అన్యాయంపై బాధితులు కోర్టును ఆశ్రయించిన విషయాన్ని బాధితుల పక్షాన వార్త రాసింది. వాళ్లు హైకోర్టును ఆశ్రయించిన సంగతి, కోర్టు అధికారులకు సూచనలు చేసిన విషయాన్నే అందులో ప్రస్తావించింది. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఆయన ‘నమస్తే’పై నోరుపారేసుకున్నారు.
బీజేపీలో ఉంటే కేంద్రమంత్రిని అయ్యేవాడినని చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో మాట్లాడా రు. తన తండ్రి వెంకటస్వామి హయాంలోనే ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా అభివృద్ధి చెందినట్టు పేర్కొన్నారు. మంచిర్యాలలో జరిగిన బహిరంగసభలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు పార్టీలు తిరిగి వచ్చినవారికి మంత్రి పదవులు కట్టబెడితే సహించబోనని డిప్యూటీ సీఎం భట్టి సమక్షంలోనే వాఖ్యలు చేయడంపై వివేక్ ఈవిధంగా స్పందించారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానిస్తేనే పార్టీలోకి వచ్చినట్టు తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. పార్టీలు మారడం ముఖ్యం కాదని.. ప్రజలకు ఎంత మంచి పని చేశామన్నదే ముఖ్యమని చెప్పుకొచ్చారు.
మంత్రి పదవిపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడిన తీరుపై బెల్లంపల్లి ఎమ్మెల్యే వినో ద్ మండిపడ్డారు. సోమవారం రాత్రి బెల్లంపల్లిలో ఆ యన మీడియాతో మాట్లాడుతూ.. గడ్డం కుటుంబంలో ముగ్గురికి టికెట్లు ఇచ్చారని ప్రేమ్‌సాగర్‌రావు పేర్కొనడం సరైన పద్ధతి కాదని అన్నారు. టికెట్లు ఎవరికి కేటాయించాలో అధిష్ఠానం సర్వే చేసి నిర్ణయం తీసుకుటుందని గుర్తుచేశారు. ప్రేమ్‌సాగర్‌రావు పై వ్యక్తిగతంగా తాము ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టంచేశారు. ఆయన తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పదవి విషయంలో తుది నిర్ణయం అధిష్ఠానిదేనని పేర్కొన్నారు. 70 ఏండ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్నామని, తనకు మంత్రి పదవి వస్తే ఆయనకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.