నా నియోజకవర్గంలోని గుండ్ల చెరువు పక్కనే తాజ్ బంజారా హోటల్ యజమాని 30 ఫీట్లు చెరువు లోపలికి చొచ్చుకు వచ్చి గోడ కట్టిండు. హైడ్రాకు నేను ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలేవీ తీసుకోలేదు. ఈ మాట చెప్పేందుకు బాధగా ఉన్నది.
హైదరాబాద్, జనవరి 6(నమస్తే తెలంగాణ) : తన నియోజకవర్గంలోని గుండ్ల చెరువు పూర్తిగా అన్యాక్రాంతం అవుతున్నదని, ఎటు చూసినా కబ్జాలే ఉంటే ఈత ఎక్కడ కొ ట్టాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో హిల్ట్ పాలసీ చర్చలో ఆయన మాట్లాడుతూ.. గుండ్ల చెరువు పక్కనే తాజ్ బంజారా హోటల్ యజమాని 30 ఫీట్లు చెరువు లోపలికి చొచ్చుకు వచ్చి గోడ కట్టాడని తాను హైడ్రాకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎ లాంటి చర్య తీసుకోలేదని, ఈ మాట సభలో చెప్పేందుకు బాధగా ఉన్నదని చెప్పా రు. గతంలో ఈ చెరువు నుంచి స్వచ్ఛమైన నీరు వచ్చేదని, గతంలో తాను, మంత్రి ఉత్తమ్ స్విమ్మింగ్ చేసేవారమని గుర్తుచేసుకున్నారు. ట్యాంక్‌బండ్ లో తమ స్విమ్మింగ్ చూసేందుకు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఠాగూర్ వచ్చేవాడని చెప్పారు. ఇప్పుడు తాము స్విమ్మింగ్ చేయాలంటే ఎక్కడ చేయాలని దానం ప్రశ్నించారు.
రేవంత్ నాయకత్వంలో 3 ట్రిలియన్ ఎకానమీ రావ డం కొంచెం ఆలస్యమైనా.. రావడం మాత్రం పక్కా అని చెప్పుకొచ్చారు. ఈ చర్చ సందర్భంగా దానం ఆసాంతం ఆవేశపూరితంగానే ప్రసంగించారు. దీంతో తొట్రుపాటుకు గురయ్యారు. షాంఘై నగరం చెన్నైలో ఉన్నదం టూ నోరు జారారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ చైనా అని చెప్పడంతో.. సరిచేసుకున్నారు. ఆవేశంలో తడబడుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను.. డుట్టి విక్రమార్క అని సంబోధించారు. ‘ముఖ్యమంత్రి గారు.. ముఖ్యమంత్రి గారు’ అంటూ పదేపదే పలుకడంతో పాటు ఆయన్ను విమర్శించేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కాగా, దానం నాన్‌స్టాప్‌గా ఆవేశంగా మాట్లాడుతుండటంతో.. మంత్రి తుమ్మ ల, విప్ రామచంద్రునాయక్ స్పీకర్ కట్ చేయాల్సిందిగా సంజ్ఞలు చేశారు.