హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ తరఫు ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్‌లో చేరినట్టు ఎకడా ప్రకటించలేదని, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసుకోలేదని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్ వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ బీఆర్ఎస్కు చెందిన ఇతర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. కేవలం ఫొటోలు, మీడియా కథనాల ఆధారంగా పార్టీ మారినట్టు నిర్ధారించి ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని కోరడం చెల్లదన్నారు. అనర్హత పిటిషన్లో లేని అంశాలను తర్వాత అదనపు అఫిడవిట్ ద్వారా చేర్చి విచారించడం చట్టబద్ధం కాదని పేర్కొన్నారు. 2024 మార్చి 15న దానం నాగేందర్ ముఖ్యమంత్రిని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిని కలిశారని, ఆ సమయంలో వారు ఆయన మెడలో కాంగ్రెస్ కండువా వేశారన్న వార్తా కథనాలు, ఫొటోలను పిటిషనర్లు ఆధారాలుగా సమర్పించారని, బీఆర్ఎస్ సభ్యత్వాన్ని దానం స్వచ్ఛందంగా వదులుకున్నట్టు నిర్ధారించేందుకు ఆ ఆధారాలు సరిపోవని చెప్పారు.
కాంగ్రెస్ టికెట్‌పై దానం సికింద్రాబాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని కూడా పిటిషనర్ ఇప్పుడు ఫిరాయింపునకు ఆధారంగా పేరొంటున్నప్పటికీ అసలు అనర్హత పిటిషన్లో ఆ అంశమే లేదని వివరించారు. అనర్హత పిటిషన్లో లేని అంశాలను అదనపు అఫిడవిట్లో చేరిస్తే అవి విచారణార్హం కావని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా దానం పోటీ చేయడం, ఆ పార్టీ నాయకులను కలవడం బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టు నిర్ధారించేందుకు సరిపోవని, బీఆర్ఎస్కు దానం అధికారికంగా ఎలాంటి రాజీనామా సమర్పించలేదని, ఆయనను బీఆర్ఎస్ నుంచి బహిషరించినట్టు లేదా సస్పెండ్ చేసినట్టు కూడా లేదని వివరించారు.
బీఆర్ఎస్ సభ్యత్వాన్ని దానం వదులుకున్నారని, ఆయనపై చర్య తీసుకోవాలని ఆ పార్టీ అసెంబ్లీ స్పీకర్‌కు ఎలాంటి లేఖ రాయలేదని, పార్టీ ఫిరాయింపు జరిగిందని చెప్తున్న బీఆర్ఎస్ నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదా అభ్యర్థన లేకుండా దానంను అనర్హుడిగా ప్రకటించాలని కోరడం సమంజసం కాదని తెలిపారు. దానం బీఆర్ఎస్ శాసనసభాపక్ష సభ్యత్వ రుసుమును చెల్లించారని, దాన్ని ఆ పార్టీ స్వీకరించిందని, అసెంబ్లీ అధికారిక రికార్డులు, బులెటిన్ ఇప్పటికీ దానంను బీఆర్ఎస్ సభ్యుడిగానే చూపిస్తున్నాయని చెప్పారు.
అసెంబ్లీలో దానంను బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కూడా తమ సభ్యుడిగానే లెకించారని, సభలో బీఆర్ఎస్ జారీచేసిన విప్‌లను దానం పాటించారని, బీఆర్ఎస్ సభ్యుడిగానే ఆయన అసెంబ్లీ కార్యకలాపాల్లో పాల్గొన్నారని, ఆయనపై బీఆర్ఎస్ ఎలాంటి క్రమశిక్షణా చర్య తీసుకోలేదని వివరించారు. ఫిరాయింపు జరిగిందని పేరొంటున్న తేదీ నాటికే అనర్హతకు దారితీసే చర్య జరిగి ఉండాలని, ఈ కేసులో మార్చి 15న పార్టీ ఫిరాయింపు జరిగిందా? లేదా? అన్నదే ప్రధానంగా నిరూపించాల్సిన అంశమని పేర్కొన్నారు. వ్యక్తిగత హోదాలో దానం అసెంబ్లీ వెలుపల చేసిన చర్యలు, రాజకీయ నాయకులను కలవడం లాంటి అంశాలకు అసెంబ్లీ కార్యకలాపాలతో సంబంధం లేదని, అవి పార్టీ ఫిరాయింపుల పరిధిలోకి రావని స్పష్టం చేశారు.
2024 మార్చి 21న కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో దానం పేరు రావడాన్ని పిటిషనర్లు ప్రస్తావిస్తున్నప్పటికీ అనర్హత పిటిషన్లో మార్చి 15న పార్టీ ఫిరాయింపు జరిగిందా? లేదా? అన్నదే ప్రధానంగా పరిశీలించాల్సిన అంశమని పేరొన్నారు. అసెంబ్లీ సభ్యుడిగా ఉన్న వ్యక్తి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని రాజ్యాంగం లేదా ప్రజాప్రాతినిధ్య చట్టం నిషేధించలేదని, వేరే పార్టీ టికెట్‌పై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని పార్టీ ఫిరాయించినట్టు ఆటోమేటిక్‌గా పరిగణించాలన్న నిబంధన రాజ్యాంగంలో లేదని వివరించారు.
కేవలం ఊహాజనిత అంశాల ఆధారంగా ఎమ్మెల్యే దానంను అనర్హుడిగా ప్రకటించలేమని, అనర్హత పిటిషన్ దాఖలు కోసం పిటిషనర్‌కు అధికారికంగా బీఆర్ఎస్ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని వాదించారు. స్పీకర్ నిర్ణయం ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడే హైకోర్టు జోక్యం చేసుకోవచ్చని, ప్రస్తుత కేసులో స్పీకర్ వెలువరించిన నిర్ణయంపై హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేరొంటూ.. పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది.