హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): వినయ్నగర్లోని నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు కానున్నది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును పసుపు బోర్డుకు అద్దెకు ఇచ్చేందుకు ఆర్‌అండ్‌బీశాఖ చీఫ్ ఇంజినీర్ చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తూ.. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో అద్దె ప్రాతిపదికన పసుపు బోర్డు కార్యాలయాన్ని నిర్వహించనున్నారు.
స్కూళ్లు కడుతుంటే స్కామ్ అంటున్నరు! ; విద్యార్థులకు బహుమతుల ప్రదానంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతుంటే అది స్కామ్ అని తనను విమర్శిస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లల కోసం రూ.25 వేల కోట్లు ఖర్చుపెట్టి పాఠశాలలు కట్టాల్సిన అవసరం ఏమున్నదని తనను విమర్శిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ గురుకులాల్లో టెన్త్, ఇంటర్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు బుధవారం బంజారాహిల్స్‌లోని బాబూ జగ్జీవన్రామ్భవన్లో అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ కాలేజీలతో పోటీపడేలా ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను రూ.200 కోట్లు పెట్టి నిర్మించనున్నట్టు తెలిపారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల్లో ఆత్మన్యూనతభావాన్ని తొలగించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్స్‌ను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పా రు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో రాణించి తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని సూచించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.