మహబూబ్‌నగర్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాలుష్యం నీటిని బయటకు వదిలితే పోలేపల్లి సెజ్‌లోని అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతానంటూ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో పోలేపల్లి సెజ్‌లోని శిల్ప, అరబిందో కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లుతున్న విషయాన్ని సభ దృష్టికి తీసుకెళ్లానని, అయినా ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అనిరుధ్‌రెడ్డి కొన్నిరోజులుగా స్వపక్షంలో విపక్షంగా మాదిరిగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. శుక్రవారం ఆయన జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్‌కు లేఖ రాసినట్టు వెల్లడించారు. అరబిందో ఫార్మా కంపెనీ కాలుష్య జలాలను ముదిరెడ్డిపల్లి చెరువులోకి పంపిస్తుండటంతో చేపలు చనిపోతున్నాయని, మత్స్యకారుల పెట్టుబడులన్నీ నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ చెరువు మంచినీటి వనరుగా ఉన్నదని పేర్కొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్యంతో అనేక దుష్ఫలితాలు వస్తున్నాయని స్పీకర్‌కు రాసిన లేఖలో వివరించారు. డబ్బులు ఇచ్చి అధికారులను, రాజకీయ నాయకులను కొనవచ్చనే భ్రమలో అరబిందో కంపెనీ ఉన్నదని ఆరోపించారు. తాను రైతుల పక్షాన ఉంటానని, ఈ కంపెనీపై చర్య తీసుకోకపోతే తానే యాక్షన్‌లోకి దిగుతానని హెచ్చరించారు.