హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటింటికీ సురక్షిత తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకం అద్భుతంగా ఉన్నదని నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం కితాబిచ్చింది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏడు రోజుల ప్రత్యేక శిక్షణ కోసం వచ్చిన నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారులు, సంస్థ డైరెక్టర్ జనరల్ హర్‌ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు కోమటి బండలోని మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించారు. మంచినీటి సరఫరా ఎలా జరుగుతున్నది. నీటిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అనే విషయాలను అడిగి తెలుసుకొన్నారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకొస్తున్నామని అధికారులు వారికి వివరించారు. నదుల నుంచి తెచ్చిన నీటిని శుద్ధి చేసి గ్రామాలకు బల్క్‌గా సరఫరా చేస్తామని, అక్కడి స్టోరేజీ ట్యాంకుల నుంచి నీరు ఇంటింటికీ నల్లాల ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ప్లాంటును సందర్శించినవారిలో 17 మంది సివిల్ సర్వీస్ అధికారులు, కోర్సు డైరెక్టర్ డాక్టర్ రావులపాటి మాధవి, కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులున్నారు.