Miss World | యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని గురువారం సాయంత్రం ప్రపంచ సుందరీమణులు సందర్శించారు. స్వయంభువును దర్శించుకొని ఆలయ శిల్ప కళా సంపదను వీక్షించారు. టెంపుల్ సో బ్యూటి పుల్ అని కితాబునిచ్చారు.
కరేబియన్ గ్రూప్ సుందరీమణులైన జాడా రామూన్, షుబ్రెయిన్ డ్యామ్స్, మైరా డెల్గాడో, నోయెమీ మల్నే, క్రిస్టీ గైరాండ్, తహ్జే బెన్నెట్, ఆరేలీ జోచిమ్, వలేరియా పెరెజ్, అన్నా లిస్ నాంటన్ కలిసి తెలుగు సంప్రదాయ రీతిలో లంగా ఓణి, చీర కట్టుతో సందడి చేశారు. కొండపైన వీవీఐపీ అతిథి గృహానికి చేరుకొని, అఖంఢ దీపారాధన పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు.
వివిధ సాంస్కృతిక కళాకారుల సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఘన స్వాగతం పలుకుతుండగా బ్రహ్మోత్సవ మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడే ఫొటో షూట్లో పాల్గొన్న సుందరీమణులు ఫోజులిచ్చారు. అనంతరం ధ్వజ స్తంభానికి మొక్కి అక్కడి నుంచి నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించి స్వయంభు లక్ష్మీనరసింహ స్వామి వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. దర్శనానంతరం ఆలయ ముఖ మండపంలో ప్రధానార్చక బృందం చతుర్వేదాశీర్వచనం చేయగా ఆలయ అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, డీఈఓ దోర్బల భాస్కర్‌శర్మ కలిసి వారికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధానాలయ ముఖ మండపంలోని ఉపాలయాలు, ఆళ్వారు పిల్లర్లు, ధ్వజస్తంభం, వివిధ రకాల ఆకృతులు, స్వామివారి ఆలయ విశిష్టత, స్థల పురాణాలను ఆలయ పారాయణికులు నల్లన్‌థీఘళ్ సీతారామాచార్యులు సుందరీమణులకు వివరించారు. దర్శనానంతరం మొదటి ప్రాకార మండపంలోని యాళీ పిల్లర్లు, అద్దాల మండపం, సప్తతల రాజగోపురం, కల్యాణ మండపాలతో, సింహాకార ఆకృతులను వీక్షిస్తూ మంత్రముగ్ధులయ్యారు.
ఆలయ నిర్మాణంలో చేపట్టిన పనులు, విశేషాలను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు వారికి వివరించారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భాగ్యం లభించడం అనందంగా ఉందన్న సంకేతాలను వారు ఇచ్చారు. అనంతరం పశ్చిమ సప్తతల రాజగోపురం గుండా మాఢవీధుల్లోకి రాగా అక్కడ నెమలి ఈకలతో సంప్రదాయ నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యాలను చూస్తూ వారితో కలిపి నృత్యాలు చేశారు. ప్రపంచ సుందరీమణుల పర్యటనలో భాగంగా రాచకొండ సీపీ సుధీర్‌బాబు నేతృత్వంలో మూడంచెల భారీ బందోబస్తును నిర్వహించారు. పర్యటన ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, జిల్లా, ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.