Milla Magee | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల్లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణల తర్వాత కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోటీల నిర్వహణకు స్పాన్సర్లను వెతికేపనిలో భాగంగా చౌమహల్లా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందు సందర్భంగా అతిథులు వ్యవహరించిన తీరే ఈ వివాదానికి మూల కారణంగా కనిపిస్తున్నది. మిస్ వరల్డ్ పోటీలకు రూ. 54 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా, రూ.27 కోట్లు ప్రభుత్వం, మరో 27 కోట్లు మిస్‌వరల్డ్ పోటీలను నిర్వహించే సంస్థ ఖర్చు పెట్టేలా ఒప్పందం చేసుకున్నారు. పోటీలకు అయ్యే ఖర్చును స్పాన్సర్ల ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించింది.
ఇందుకోసం సీనియర్ ఐఏఎస్ అధికారి అధ్యక్షతన కమిటీ నియమించింది. ప్రభుత్వం తరఫున స్పాన్సర్‌షిప్‌ను ఆహ్వానించారు. స్పాన్సర్ చేయడానికి కొన్ని వాణిజ్య సంస్థలు కూడా ఆసక్తిని కనబరిచినట్టు తెలిసింది. అధికారిక, అనధికారిక ఒప్పందం అని రెండు షరతులను కొందరు అధికారులు పెట్టడంతో వాణిజ్యసంస్థలు స్పాన్సర్‌షిప్‌ను చేయటానికి నిరాకరించినట్టు తెలుస్తున్నది. అందాల పోటీలు ముగింపు దశలకు వచ్చినప్పటికీ స్పాన్సర్స్ ముందుకు రానట్టు సమాచారం. దీంతో చౌమహల్లా ప్యాలెస్‌లో విందు ఏర్పాటుచేసి ప్రముఖులను ఆహ్వానించి స్పాన్సర్షిప్ రాబట్టాలని వేసిన ప్రణాళిక ఇప్పుడు వివాదాస్పదమైంది.
భారత్-పాక్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందాలభామలకు ఇచ్చే విందును రద్దు చేసినట్టు సచివాలయ వర్గాలు ప్రకటించాయి. కానీ అధికారులు అగమేఘాల మీద మళ్లీ విందు ఏర్పాట్లు చేశారు. ప్రముఖుల పేరుతో 300 మందిని ఆహ్వానించారు. వీరిలో బిజినెస్, నిర్మాణరంగం, స్థిరాస్తి వ్యాపారం, సినిమా, ఫార్మా, హోటల్, మెడికల్, రాజకీయ రంగాలకు చెందిన వారున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నారు. స్పాన్సర్స్ కోసమే చౌమహల్లా ప్యాలెస్‌లో కొందరు అధికారులు విందు ఏర్పాటుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. ఒక్కో అతిథి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు స్పాన్సర్షిప్ నిధులు సేకరించాలని అధికారులు ఆలోచిం చినట్టుగా విశ్వసనీయవర్గాల సమాచారం.
చౌమహల్లా ప్యాలెస్ విందుకు వివిధ రంగాల ప్రముఖులు, ధనవంతులు హాజరైన తర్వాత జరిగిన పరిణామాలు విమర్శలకు దారితీస్తున్నాయి. విందు నిర్వాహకులు అతిథులందరినీ సాదరంగా టేబుల్స్ వద్ద కూర్చోబెట్టారు. ఒక్కో టేబుల్ వద్ద ఆరుగురు వీఐపీలు కూర్చునే వీలు కల్పించారు. ఆరుగురు ప్రముఖులు కూర్చున్న చోట ఇద్దరు సుందరీమణులను కూర్చోబెట్టినట్టు సమాచారం. ఆ సమయంలో ప్రభుత్వ ఉన్నతాధికారి మాట్లాడుతూ అతిథులతో అందాల భామలు మాట్లాడాలని, ఒకరినొకరు పరిచయం చేసుకోవచ్చని (డియర్ గర్ల్స్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఈజ్ ది ఈజీ ఈవినింగ్. యూ ఆల్ ఫ్రీ. యూ ఆర్ ఫ్రీ టు మింగిల్ ఇఫ్ సమ్‌వన్ క్యాచెస్ యువర్ ఐ.. యూ కెన్ గో అండ్ టాక్ టు దెమ్. యూ కెన్ షేర్ యువర్ ఒపీనియన్స్.
యూ కెన్ టేక్ సెల్ఫీ అండ్ ఫొటోస్. ఇట్ కెన్ బీ యాజ్ యూ లైక్) ప్రకటన చేశారు. కొందరు వీఐపీలు వివిధ దేశాల సుందరీమణుల వద్దకు వెళ్లి, ఫొటోలు, సెల్ఫీలు దిగారు. కానీ మరికొందరు హద్దుమీరి ప్రవర్తించినట్టు తెలుస్తున్నది. అధికార పార్టీ నేత ఒకరు ఓ దేశ సుందరి వద్దకు వెళ్లి అనుచితంగా ప్రవర్తన కనబర్చినట్టు సమాచారం. తీవ్ర అసహనానికి గురైన సదరు యువతి.. పక్కనే ఉన్న అధికార పార్టీకి చెందిన మహిళా నాయకురాలికి ఫిర్యాదు చేయగా, ఆమెకు భాష అర్థంకాక పట్టించుకోనట్టు తెలిసింది. ఆ నాయకుడు ఎవరు? బాధిత అందాలభామ ఎవరనే విషయంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
మిస్‌వరల్డ్ సంస్థ నిర్వాహకులు పోటీదారులకు ఇచ్చిన షెడ్యూలులో లేని కార్యక్రమాలను చేర్చినట్టు తెలుస్తున్నది. కంటెస్టెంట్లు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేలా నిర్వాహకులు ఒత్తిడి చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. చిన్నచిన్న వ్యాపారులతో రూ.5 లక్షలు, రూ.10 లక్షలు పారితోషికం మాట్లాడుకొని కంటెస్టెంట్లను ఆయా కార్యక్రమాల ప్రమోషన్‌కు తీసుకెళ్లినట్టు తెలిసింది. కొన్ని ప్రైవేట్ సంస్థల బ్రాండ్లను ప్రమోట్ చేయడమే దీని ఉద్దేశమని చర్చ జరుగుతున్నది.
మిస్ వరల్డ్ కంటిస్టెంట్లను వారి ఈవెంట్స్‌కు పరిమితం చేయకుండా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడమేంటని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. షెడ్యూల్‌ను ఫాలో కాకుండా స్పాన్సర్స్ కోసమో, ప్రచారం కోసమో వారిని వివిధ ప్రాంతాలకు తిప్పడమేంటని నిలదీస్తున్నారు. ప్రభుత్వం, నిర్వాహకులు, అధికారుల తీరు వల్ల తెలంగాణతోపాటు దేశ ప్రతిష్ఠను దెబ్బదీశారని మండిపడుతున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వివిధ దేశాలకు ప్రతినిధులు అనే విషయాన్ని మర్చిపో యి, గల్లీ లీడర్లను సైతం అనుమతిస్తే వా రు బంధువులు, స్నేహితులతో కలిసి ఫొ టోలు తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్లే మిల్లా మ్యాగీ కూడా ‘మంకీ షో’ వంటి కామెం ట్స్ చేశారని గుర్తుచేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ లోపంతో హైదరాబాద్ పేరును అభాసుపాల్జేశారని మండిపడుతున్నారు.