హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): నిధుల మంజూరుకు, విడుదలకు చాలా తేడా ఉంటుంది. ప్రభుత్వంలో పనిచేసిన ‘ఐఏఎస్’లకు ఈ విషయం మరింత లోతుగా తెలుసు. మంజూరు అంటే ఒక భరోసా, అవి ఎప్పుడైనా విడుదల కావొచ్చు. కాగితాల్లో కనిపించేవన్నీ ఇచ్చినట్టు కాదు. కేంద్రం కేటాయింపుల్లో ఏండ్ల తరబడి నిధుల విడుదల వెయిటింగ్లో ఉంటాయి. సమగ్ర శిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ)కు కేంద్రం కేటాయింపులపై రిటైర్డ్ ప్రభుత్వ ఉన్నతాధికారికి ఓ కాగితం దొరికింది. దాన్ని పట్టుకొని నిధులు చేతికొచ్చినా మురగబెట్టారంటూ అరవటం మొదలైంది. సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఈ అంశంపై రాష్ట్ర ఆర్థికశాఖ వివరణ ఇచ్చింది. సమగ్ర శిక్ష అభియాన్ పథకం అమలు కోసం 2017-18 నుంచి 2021-22 వరకు మొత్తం రూ.11,451.32 కోట్లు వెచ్చించేందుకు ప్రాజెక్టు ఆమోదిత మండలి ఆమోదం తెలిపింది. కానీ ఈ ఐదేండ్లలో కేంద్రం విడుదల చేసింది రూ.3,141.46 కోట్లు మాత్రమే.
తెలంగాణ రాష్ట్రం తన వాటాగా రూ.2,141.76 కోట్లను విడుదల చేసింది. కేంద్రం, రాష్ట్రం వాటా కలిపితే కలిపి రూ.5,283.22 కోట్లు జమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.5,462.95 కోట్లు ఖర్చుచేసింది. అంటే రాష్ట్రం తన వాటా కంటే రూ.200 కోట్లకుపైగా అదనంగా వెచ్చించింది. ఇది వాస్తవమైతే, రూ.9,456 కోట్లు మురగిపోతున్నాయని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలకు విరుద్ధంగా రాష్ట్రంపై బురదజల్లుతున్నారు. ఈ పథకం నిర్వహణకు, నిధుల కేటాయింపునకు, విడుదలకు, వెచ్చింపులకు తేడాలు తెలిసి కూడా తప్పుదోవపట్టిస్తున్నారు. రాష్ర్టానికి కేంద్రం ఇచ్చిన నిధులు ఖర్చుచేయకపోతే నీళ్ల పాలైనట్టు, మురిగిపోయినట్టుగా భావించాలి. కానీ, కేంద్రం నిధులు ఇవ్వకపోయినప్పటికీ రాష్ట్రంపైనే నెపం నెడుతున్నారు. నిజానికి కేంద్రం వాటాగా మరో రూ.3 వేల కోట్లకు పైగా రావాల్సి ఉన్నది. ఈ నిధుల కోసం కేంద్రాన్ని నిలదీయడానికి బదులుగా రాష్ర్టాన్నే బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ముందు రాష్ర్టాలే ఇవ్వాలంటూ పేచీ
విద్య, వైద్య రంగాల విషయంలో కేంద్రం పెద్దన్నలా వ్యవహరించాల్సి ఉంటుంది. తానే ముందుగా చొరవ తీసుకొని నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక సత్సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చింది. ముందుగా రాష్ర్టాలు తమ వాటా నిధులు ఇస్తేనే మేమిస్తామంటూ పేచీ పెడుతున్నది. మోదీ అధికారంలోకి రావడానికి ముందున్న ప్రభుత్వాలు 2014కు పూర్వం ఇలా ఎప్పుడూ వ్యవహరించలేదు. ప్రాజెక్టు ఆమోదిత మండలి సమావేశంలో తీసుకొన్న నిర్ణయాల మేరకు తొలుత అడ్హాక్, మొదటి ఇన్స్టాల్మెంట్, రెండో ఇన్స్టాల్మెంట్ కింద రాష్ర్టాలకు విడుదల చేసేవి.
హేతుబద్ధీకరణతో ముడి
ఎస్ఎస్ఏ నిధుల విడుదలకు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు కేంద్రం కొంతకాలం ముడిపెట్టింది. కేంద్రం చెప్పినట్టుగా హేతుబద్ధీకరణ చేపడితే కొన్ని పాఠశాలలు మూతపడి, విద్యార్థులు ఇబ్బందిపడతారన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పనిచేయలేదు. దీంతో ఉపాధ్యాయులకు వేతనాల కింద నిధుల్లో కేంద్రం కోతలు విధించింది. ఆ భారాన్ని రాష్ట్రమే భరిస్తున్నది.
సీలింగ్‌తో కోతలు
ఈ ప్రాజెక్ట్‌కు ప్రతి ఏటా ప్రతిపాదనలు సమర్పించే సమయంలోనే కేంద్రం కోతలు పెడుతున్నది. ప్రతిపాదనలు ఇవ్వాలని షరతులు పెడుతున్నది.