హైదరాబాద్, జూన్25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఓ చీఫ్ ఇంజినీర్ కీచక చర్యలపై మహిళా ఉద్యోగులు ఆ శాఖ మంత్రి సీతక్కతోపాటు ముఖ్యకార్యదర్శి శ్రీధర్‌కు ఫిర్యాదుచేశారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అతగాడు.. వెకిలి చేష్టలతో లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొన్నారు. పగలు, రాత్రి అనే తేడాలేకుండా వీడియో కాల్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని వాపోయారు. తక్షణమే అతడిపై చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా మహిళా ఉద్యోగులు బుధవారం ఫిర్యాదు చేశారు. ‘ఖైరతాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో బాధ్యతలు నిర్వహించే చీఫ్ ఇంజినీర్.. తోటి సిబ్బంది, మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. అతడి చెడు ప్రవర్తన, వీడియో కాల్స్, బూతు మాటలను సహించలేకపోతున్నాం.
ప్రత్యేకించి మహిళా ఉద్యోగులకు వీడియో కాల్స్ చేస్తుంటాడు. జిల్లాలకు పర్యటనలు చేయాలని ఆదేశిస్తాడు. హైదరాబాద్ నుంచి 100 కి.మీ. దూరంలోనే ఉన్నప్పటికీ రాత్రి విడిది చేయాలని పట్టుబడుతుంటారు. దీనివల్ల మహిళా ఉద్యోగుల కుటుంబ జీవనంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మహిళా అధికారులతో అసభ్య మాటలు ఉపయోగిస్తారు. మేము నివేదికలను సాఫ్ట్‌కాపీల రూపంలో, సరళమైన ప్రొఫార్మాలో సమర్పించేవాళ్లం. కానీ, ఆయన ప్రొఫార్మాను తరచూ మారుస్తూ మమ్మల్ని పని ఒత్తిడికి గురిచేస్తున్నారు.
అతడి అస్పష్టమైన నిర్ణయాల వల్ల విధులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కోలేక ఇప్పటికే ఇద్దరు మహిళా సిబ్బంది ఉద్యోగాలు వదిలివెళ్లారు. కొంతమంది ఆయన బారి నుంచి తప్పించుకోవడానికి దీర్ఘకాలిక సెలవులు పెట్టారు. సెలవు నుంచి తిరిగి వచ్చిన మహిళా ఉద్యోగులకు జాయినింగ్ రిపోర్టులను ఆమోదించకుండా వేధిస్తున్నారు. ఆయన పీఏతోపాటు కంప్యూటర్ ఆపరేటర్లను తన ల్యాప్‌టాప్‌పై పనిచేయమని, తన పకన కూర్చోవాలని, కొన్నిసార్లు గది తలుపు మూసివేయమని కూడా చెప్తున్నారు. ఆయన నియంత్రణలో హెడ్ ఆఫీసులో, ఫీల్డ్‌లో పనిచేయడం మాకు చాలా కష్టంగా ఉన్నది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి’ అని బాధిత మహిళా ఉద్యోగులు ఫిర్యాదులో విజ్ఞప్తిచేశారు.