మిర్చి రైతులకు ఓ వ్యాపారి టోకరా ఇచ్చాడు. రైతుల నుంచి వెయ్యి క్వింటాళ్ల మిర్చిని కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని మలుగుమాడులో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మలుగుమాడు గ్రామానికి చెందిన కృష్ణారావు మిర్చి వ్యాపారి. కొద్ది రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన రైతుల నుంచి దాదాపు వెయ్యి క్వింటాళ్ల మిర్చిని కొనుగోలు చేశాడు. 15 రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తానని మిర్చి కొనేటప్పుడు రైతులకు మాటిచ్చాడు. కానీ వ్యాపారి చుట్టూ ఎంత తిరిగినా డబ్బులు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే కృష్ణారావు గ్రామం విడిచి వెళ్లిపోయాడు. అతని గురించి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే 15 రోజుల కిందటి నుంచి వారు కూడా కనిపించడం లేదు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు.. ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ నుంచి కొనుగోలు చేసిన మిర్చి పంట విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.