హైదరాబాద్, మార్చి24( నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండానే నిరుడు అక్టోబర్ 31న అప్పటికప్పుడు నేరుగా క్యాబినెట్ మంత్రి అయిపోయిన మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ భవితవ్యం సందిగ్ధంలో పడినట్టు చర్చ జరుగుతున్నది. ఏప్రిల్ 30తో ఆయన పదవీకాలం ముగిసిపోనుండటంతో రాజీనామా చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గడువుకు ఒకటీరెండు రోజుల ముందే రాజీనామా చేయించి, మే 16 తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో మరోసారి క్యాబినెట్లోకి తీసుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టు తెలిసింది. నవంబర్ 14తో ప్రజాకవి గోరటి వెంకన్నతోపాటు, మరో ఇద్దరు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనున్నందున, వెంకన్న స్థానంలో అజార్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని సూచనప్రాయంగా తెలిపినట్టు సమాచారం. అయితే హెచ్‌సీఏలో నిధుల గోల్మాల్ ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ అంగీకరిస్తారనే చర్చ జరుగుతున్నది.
ముస్లిం ఓటర్లను ఆకర్షించటం ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలువాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్‌కు అప్పటికప్పుడు మంత్రి పదవి కట్టబెట్టింది. ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం అంత సులభమేమీ కాదనే విషయం తెలిసి కూడా ప్రభుత్వం ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది. తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటా కింద ప్రస్తుతానికి రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు స్థానాల్లో ఇప్పటికే కోదండరాం, అజారుద్దీన్ పేర్లను మంత్రివర్గం ఆమోదించి, 2025 ఆగస్టు 30న గవర్నర్‌కు పంపింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పాత గవర్నర్ ఈ ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టారు. ప్రస్తుతం కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా బాధ్యతలు చేపట్టడం, సుప్రీంకోర్టులో ఉన్న కేసు విచారణకు రా వడం దాదాపు ఒకేసారి జరిగింది. మంత్రి మండలి సిఫారసు చేసిన పేర్లను గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్‌లో పెడితే, హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసి అజారుద్దీన్ అంశంతో పాటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నామినేటెడ్ పదవులు భర్తీపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకటి కోదండరాం, మరొకటి అజారుద్దీన్ పేర్లను అధిష్ఠానం సూచించినట్టు తెలిసింది.
ఒకవేళ గవర్నర్ ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఎలా? అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆందోళన పడుతున్నట్టు తెలిసింది. సుప్రీంకోర్టు సూచన మేరకు హైకోర్టుకు వెళ్తే, అక్కడ పరిష్కారం కావటానికి కనీసం 3నుంచి 4నెలల సమయం పట్టవచ్చని, అదే జరిగితే రెండోసారి కూడా అజారుద్దీన్ చట్టసభల్లోకి ఎంపికయ్యే దారులన్నీ మూసుకుపోతాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో అజారుద్దీన్‌తో రాజీనామా చేయించి, మే నెలలో మరోసారి ఢిల్లీ వెళ్లి కొత్త మం త్రులు, ఉద్వాసన పలుకనున్న మంత్రుల జాబితాపై చర్చించి పార్టీ అధినాయకత్వం పెద్దల అనుమతి తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం. మే16 తర్వాత మంత్రివర్గ విస్తరణ, శాఖల్లో మార్పులు చేర్పులు చేయాలని ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. అప్పుడు రెండోసారి అజారుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అప్పటినుంచి ఆరు నెలల్లో అంటే ఈ ఏడాది నవంబర్ 14 తర్వాత మండలిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలు అవుతాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్యల పదవీ కాలం పూర్తికానున్నది.
అజారుద్దీన్ 2020-2023 మధ్యకాలంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సుమారు రూ.3.8 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగిందని ఈడీ అభియోగం మోపింది. ఈ కేసులో అజారుద్దీన్ అప్పట్లో ముందస్తు బెయిల్ తీసుకున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ క్రికెట్ స్టేడియంలో మౌలిక సదుపాయాల్లో భాగంగా.. డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక యంత్రాల కొనుగోళ్లలో దాదాపు రూ.20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్టు హెచ్‌సీఏ మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈక్రమంలోనే అజారుద్దీన్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ ఆమోదిస్తారా? మళ్లీ పెండింగ్‌లో పెడుతారా? అని చర్చ జరుగుతున్నది.