బ్యాంకర్లు సానుకూల దృక్పథంతో సహకరించాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్
లబ్ధిదారుల ఎంపిక విధివిధానాల ఖరారుపై అధికారులతో సమీక్ష
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ వినూత్న పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. మైనార్టీల్లో పేదరిక నిర్మూలనకే సబ్సిడీ రుణాలను అందజేస్తున్నారని స్పష్టం చేశారు. గతంలో 20-30 శాతంగా ఉన్న సబ్సిడీని 60 నుంచి 95 శాతం వరకు పెంచినట్టు తెలిపారు. ఈ రుణాల విషయంలో బ్యాంకర్లు సానుకూల దృక్పథంతో సహకరించాలని, నిబంధనల పేరిట లబ్ధిదారులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. 5 వేల మంది మైనార్టీలకు సబ్సిడీ రుణాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.50 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక, రుణాల మంజూరుకు సంబంధించిన విధివిధానాల ఖరారుపై మంత్రి కొప్పుల సోమవారం తన క్యాంపు కార్యాలయంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్‌తో కలిసి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీ, జనరల్ మేనేజర్ యూనస్, ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ మోహన్‌దాసు, స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీకి చెందిన జే భాసర సుబ్రమణ్యం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.