సుల్తానాబాద్, అక్టోబర్ 21 : రోడ్డు ప్రమాదంలో గురుకులం విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి గ్రామంలోని తెలంగాణ మైనార్టీ గురుకులం వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మం డలం అన్నారం గ్రామానికి చెందిన ఖాజా నదీమొద్దీన్ మహ్మద్(17) సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లిలోని మైనార్టీ రెసిడెన్షియల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
సోమవారం రాత్రి 8 గంటలకు ఇద్దరు స్నేహితులతో కలిసి కాలేజీ ముందున్న హోటల్‌కు వెళ్లేందుకు రాజీవ్ రహదారి దాడుతుండగా పెద్దపల్లి వైపు నుంచి కరీంనగర్ వెళ్తున్న లారీ అతివేగంగా నదీమొద్దీన్ను ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విద్యార్థి తల్లి సుమయషరీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపారు.