హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ముచ్చటగా మూడోసభ నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీలోకి మైనార్టీ నాయకులు క్యూ కట్టారు. ఔరంగాబాద్ ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ముదస్సిర్ అన్సారీ నేతృత్వంలో పార్టీలో భారీగా చేరారు. ఔరంగాబాద్ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, శివసేన, ఎంఐఎం పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు గులాబీ కండువాలు కప్పుకొన్నారు. మంగళవారం ఔరంగాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారికి ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్‌అహ్మద్, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, బీఆర్ఎస్ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ హిమాన్షు తివారీ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, మైనార్టీల సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మైనార్టీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని చెప్పారు. తొమ్మిదేండ్లలో మైనార్టీల సంక్షేమం కోసం రూ.8,581 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రంజాన్ పండుగ నేపథ్యంలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా పేద ముస్లిం మహిళలకు 20 వేల కుట్టుమిషన్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 815 మసీదు మేనేజింగ్ కమిటీలకు ఒకో కమిటీకి 500 చొప్పున రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను ఇప్పటికే సరఫరా చేసినట్టు వివరించారు.
షాదీముబారక్ ద్వారా ఇప్పటివరకూ 2,32,713 మంది నిరుపేద ముస్లిం ఆడబిడ్డల పెండ్లికి రూ.1,903 కోట్లను అందించినట్టు చెప్పారు. ఈ నెల 24న ఔరంగాబాద్‌లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లో చేరినవారిలో అర్షద్ అహ్మద్, మతీంఖాన్, సాలీస్, హుజేఫ్, అమీర్, షేక్ సిరాజ్, సల్మాన్ అలీషేర్, జీయఉద్దీన్ పటేల్, అస్లాంపటేల్, షేక్, జునైద్‌ఖాన్, ముజామిల్ అన్సారీ, షఫీమ్లాల, హాబీబ్, ఎంఎం పాటిల్ ఉన్నారు.
అంకాస్ మైదానంలో ఔరంగాబాద్ సభ
ఈ నెల 24న మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లా కేంద్రంలోని అంకాస్ మైదానాన్ని బహిరంగ సభా ప్రాంగణంగా నిర్ణయించారు. మంగళవారం పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి, పార్టీ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం తదితరులు స్థలాన్ని పరిశీలించారు.