మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 01:37:45

జాతీయ మైనార్టీ కమిషన్‌ ఏర్పాటు

జాతీయ మైనార్టీ కమిషన్‌ ఏర్పాటు

మన పీవీ.. ఘనత ఇదీ!

మైనార్టీలకు పలు హక్కులు, రక్షణలను రాజ్యాంగం కల్పించింది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలలో ఇవి పొందుపరిచి ఉన్నాయి. ప్రధాని పదవి చేపట్టిన వెంటనే అల్పసంఖ్యాక వర్గాలలో ఆత్మస్తైర్యం నింపడానికి, రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పీవీ నరసింహారావు సంకల్పించారు.  పీవీ ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే సామాజిక కోణంలో తీసుకున్న పలు నిర్ణయాలలో జాతీయ అల్ప సంఖ్యాకవర్గాల కమిషన్‌ ఏర్పాటు చేయడం ప్రధానమైనది. ఇందుకు ఐక్యరాజ్య సమితి తీర్మానం కూడా మార్గదర్శకంగా పనిచేసింది. జాతి, మత, భాషాపరమైన హక్కులను పరిరక్షించాలని పిలుపు ఇస్తూ 1992 డిసెంబర్‌ 18 వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అల్పసంఖ్యాకవర్గాలు వ్యక్తిగతంగా, బహిరంగంగా ఎటువంటి వివక్షకు తావు లేకుండా, తమ సంస్కృతిని అనుసరించడానికి, తమ మతాన్ని అవలంబించడానికి, తమ భాషను ఉపయోగించుకోవడానికి హక్కులు ఉండాలనేది ఈ తీర్మానం ప్రధానాంశం. కేంద్రం 1992లో జాతీయ మైనార్టీ కమిషన్‌ చట్టం చేసింది. దీనికి అనుగుణంగా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

మొదట సిక్కు, బౌద్ధ, పార్సీ, క్రైస్తవ, ముస్లిం వర్గాలను ఈ కమిషన్‌ పరిధిలోకి తెచ్చింది. ఆ తరువాత జైనులను కూడా చేర్చింది. చట్ట ప్రకారం ఇందులో సభ్యులు అంతా మైనార్టీ సామాజిక వర్గాల వారే అయి ఉండాలి. కేంద్ర, రాష్ర్టాలలో మైనార్టీలు సాధించిన అభివృద్ధిని ఈ కమిషన్‌ విశ్లేషిస్తుంది. అల్పసంఖ్యాకవర్గాల ప్రయోజనాలను, రక్షణలను అమలు చేయడానికి సూచనలు చేస్తుంది. వారి ప్రయోజనాలకు, రక్షణలకు భంగం వాటిల్లినట్టు ఫిర్యాదులు అందితే పరిశీలిస్తుంది. వారి పట్ల వివక్షపై అధ్యయనాలు సాగించి, నిర్మూలనకు కృషి చేస్తుంది. అల్పసంఖ్యాకవర్గాల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధిపై అధ్యయనాలు, పరిశోధనలు జరుపుతుంది. వీరి సమస్యలపై నిర్ణీత కాలవ్యవధిలో కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సూచించే అంశాలను కూడా చేపడుతుంది.

 మైనార్టీల హక్కుల పరిరక్షణలో భాగంగా దేశంలోని ఏ మూలన ఉన్న వారినైనా పిలిపించి విచారించే అధికారం మైనార్టీ కమిషన్‌కు ఉంటుంది. ఏదైనా అధికార పత్రం సమర్పించమని కోరవచ్చు. అయితే కమిషన్‌ సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన అధికారాలు ఉన్నాయా అనే విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ కమిషన్‌కు రాజ్యాంగ హోదా లేకపోవడం వల్ల అధికారాలకు పరిమితి ఏర్పడిందనే అభిప్రాయం ఉన్నది. 

కమిషన్‌ సూచనలను ప్రభుత్వాలు పట్టించుకోవాలనేమీ లేదు. అయితే కమిషన్‌ సూచనలను, వాటిపై తీసుకున్న చర్యలను పార్లమెంటుకు సమర్పించవలసి ఉంటుంది. అందువల్ల కమిషన్‌ సూచనలకు ప్రాధాన్యం ఏర్పడింది. హిందువులు మెజారిటీగా లేని రాష్ర్టాలలో వారిని మైనార్టీలుగా ప్రకటించాలని కోరుతూ మైనార్టీ కమిషన్‌కు విజ్ఞప్తి వచ్చింది. అయితే ఏ సామాజిక వర్గాన్నయినా మైనార్టీగా ప్రకటించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నదని కమిషన్‌ స్పష్టం చేసింది. logo