Telangana | హైదరాబాద్, మార్చి 6 ( నమస్తే తెలంగాణ ) : బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీల వర్గీకరణపై ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్యాబినెట్ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల అమలుకు రెండు వేర్వేరు తీర్మానాలు ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక ఎస్సీ వర్గీకరణపై చట్టం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కు లూ రాకుండా రాబోయే అసెంబ్లీలో చట్టం తేవాలని నిర్ణయించామని, ఆ మేరకు ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపామని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని, సమావేశ నిర్ణయాలను కేంద్రానికి నివేదించాలని నిర్ణయించామని చెప్పారు.
తెలంగాణను మూడు కోర్ ఏరియాలుగా విభజించామని తెలిపారు. ఓర్ఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రెండు కిలోమీటర్ల వరకు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేకంగా 90 పోస్టులను మంజూరు చేశామని చెప్పారు. హెచ్ఎండీఏను భారీగా విస్తరించనున్నామని, దాని పరిధిలోకి 11 జిల్లాలు, 104 మండలాలతో 1355 గ్రామాలు రానున్నాయని వివరించారు. వీటిలో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు ఏర్పాటవుతాయని చెప్పారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయనున్నామని మంత్రి చెప్పారు. ఇందుకోసం మహిళా శక్తి-2025 పాలసీని ఆమోదించామని తెలిపారు. మహిళా సంఘాల సభ్యత్వానికి వయో పరిమితిని 15 నుంచి 65 ఏండ్లుగా నిర్ణయించామని చెప్పారు. టీటీడీ బోర్డులా యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపామని అన్నారు. ఇందుకోసం 1987 దేవాదాయ చట్టాన్ని సవరించనున్నామని తెలిపారు. అలాగే27 కొత్త పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని చెప్పారు.